తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

వరల్డ్​లోనే మోస్ట్​ పాపులర్​ మూవీ.. 2000 భాషల్లో డబ్.. 2025 కల్లా 1000 కోట్ల వ్యూస్​! - movie about jesus christ

వినోదాన్ని కోరుకునే వారికి సినిమా ఓ అత్యుత్తమ సాధనం. అందుకే చాలా మంది సినిమాలు చూడటానికి ఇష్టపడుతుంటారు. ఒక భాషలో సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటే.. దాన్ని ఇతర భాషల్లోకి అనువదిస్తుంటారు మేకర్స్​. అయితే ఓ చిత్రం ఇప్పటి వరకు 2000 భాషలకుపైగా అనువదించారు. ఆ సినిమా ఏంటంటే?

jesus movie
jesus movie

By

Published : Apr 2, 2023, 2:10 PM IST

వీధి నాటకాల నుంచి రూపాంతరం చెందిన సినిమా.. ప్రస్తుతం వినోద రంగాన్ని శాసిస్తోంది. సినిమాలను ఆదరించే వారి సంఖ్య కూడా అంతకంతకూ పెరుగుతోంది. కొత్త సాంకేతికతో సినిమాలు కూడా గతంలో కంటే ప్రేక్షకులకు మెరుగైన అనుభూతి పంచుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా భారీగా పెరిగిపోయిన సినిమా వ్యాపారం.. ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. మంచి ఆదరణ లభించిన సినిమాల గురించి ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు విడుదలైన సినిమాల్లో ఏ చిత్రం అత్యధిక భాషల్లోకి అనువదించారో తెలుసుకుందాం.

రికార్డు సృష్టించిన 'జీసస్'..
సినిమాలు భారీగా ప్రేక్షకుల మన్ననలు పొందాలంటే ఊహకందని విధంగా నిర్మించాలని అనుకుంటాం. కానీ ఎలాంటి కమర్షియల్ హంగులు లేని ఓ చిత్రం ఇప్పటివరకు వేరే ఏ సినిమాకు సాధ్యంకాని రికార్డులను సొంతం చేసుకుంది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్​లో స్థానం సంపాదించుకుంది. అదే 1979లో విడుదలైన 'జీసస్'. ఈ సినిమా జూలై 2012లో ఎక్కువ భాషల్లోకి అనువాదం అయిన చిత్రంగా రికార్డును సృష్టించింది. ఆ సమయానికి ఈ సినిమా 817 భాషల్లోకి అనువాదం కావడంతో పాటు రెండు బిలియన్ల మంది వీక్షణలను సాధించింది. పదేళ్ల తర్వాత ఈ సినిమాను మరిన్ని భాషల్లోకి అనువాదించారు.

ఈ సినిమాను ఎక్కువ భాషల్లోకి అనువదించడం వల్ల అన్ని ప్రాంతాల ప్రజలకు చేరువైంది. థియేటర్లలో మాత్రమే ప్రదర్శించడం కాకుండా గ్రామగ్రామానికి వెళ్లి ప్రొజెక్టర్ల ద్వారా ఈ సినిమాను ప్రదర్శించాయి మిషినరీలు. దీంతో మారుమూల గ్రామాలకు, దూరంగా నివసించే ప్రజలకు కూడా చేరువైంది. కాలంతో, టెక్నాలజీతో పోటీపడి మరీ ఈ సినిమా.. ప్రజల వద్దకు చేరింది. భూమి మీద ఉన్న మారుమూల ప్రాంతాల్లో కూడా ప్రదర్శించిన సినిమాగా 'జీసస్' నిలిచింది.

'జీసస్' సినిమా ఎలా ప్రారంభమైందిలా..
బిల్ బ్రైట్ స్థాపించిన ఒక సువార్త సమూహం 'క్యాంపస్ క్రుసేడ్ ఫర్ క్రీస్ట్'.. ఈ సినిమా నిర్మాణానికి ఎంతో కష్టపడింది. బ్రిటిష్ ప్రొడ్యూసర్ జాన్ హేమన్.. బైబిల్​ను సినిమాలాగా తీయాలనుకునే వారు. 1976లో క్యాంపస్ క్రుసేడ్​తో కలిసి ఈ ప్రాజెక్ట్ పని చేయడం మొదలుపెట్టారు. తర్వాత క్యాంపస్ క్రుసేడ్.. తన మద్దతుదారులతో ఈ సినిమా నిర్మాణం కోసం $6 మిలియన్లను సేకరించింది. సినిమా స్క్రిప్టును లూకా సువార్త నుంచి తీసుకొని ఈ సినిమాను సిద్ధం చేశారు. అయితే ఈ సినిమాలో అతి ముఖ్యమైన జీసస్ పాత్రను పోషించడానికి బ్రిటిష్ రంగస్థల నటుడు బ్రియాన్ డీకన్ ఎంపిక అయ్యారు.

అంతకు ముందు రాబర్ట్ పావెల్ 1976లో వచ్చిన టీవీ మినీ సిరీస్​లో జీసస్ పాత్రను పోషించారు. అలాగే 1965లో జార్జ్ స్టీవెన్ తీసిన 'ది గ్రేటెస్ట్ స్టోరీ ఎవర్ టోల్డ్'లో మాక్స్ వాన్ సిడో క్రీస్తు పాత్రలో నటించి మెప్పించారు. వీళ్లను కాకుండా బ్రియాన్ డీకన్​ను ఎంపిక చేయడం ఆశ్చర్యం కలిగించినా.. ఆయన పాత్రలో లీనమైపోయి అందరినీ మైమరపించారు. ఆయన శరీర రంగు అదనపు బలం కాగా.. క్రీస్తు రూపంలో డీకన్ కనిపించడానికి ప్రోస్థెటిక్ ముక్కును ఉపయోగించారు.

1978 చివర్లో దర్శకులు జాన్ క్రిష్, పీటర్ సైక్స్ నేతృత్వంలో ఇజ్రాయెల్​లో ఈ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమాలో డీకన్ మాత్రమే బ్రిటిష్​కు చెందిన వ్యక్తి కాగా.. మిగిలిన పాత్రలు పోషించింది మాత్రం ఇజ్రాయెల్, యెమన్ యోధులే. దాదాపు 5వేల మంది సహాయ నటులు ఈ సినిమా కోసం పని చేయగా.. లూకాలో చెప్పిన ప్రతి సన్నివేశాన్ని చిత్రీకరించడానికి మొత్తం 31 వారాలు పట్టింది.

1979లో విడుదల..
వార్నర్ బ్రదర్స్ సంస్థ.. అక్టోబర్ 1979లో 'జీసస్'ను కేవలం 300 థియేటర్లలో విడుదల చేసింది. బైబిల్ ప్రభావిత ప్రాంతాల్లో, చిన్న మార్కెట్లో ఈ సినిమా విడుదల అవడం వల్ల పెద్దగా లాభాలు సాధించలేకపోయింది. అయితే, ఈ సినిమాను ఇతర భాషల్లోకి విడుదల చేయడానికి, అందుకు తగ్గట్టుగా అనువాద కార్యక్రమాన్ని ప్రారంభించింది చిత్ర యూనిట్. భారతదేశంలోనూ ఈ సినిమా హిందీ అనువాదం విడుదలై, 21 మిలియన్ల మందిని అలరించింది. రిలీజైన ఆరేళ్లలో 'జీసస్' సినిమా 100 భాషల్లోకి డబ్​ అయింది. ఆఫ్రికన్, దక్షిణ అమెరికా భాషల్లోకి అనువాదాలు పూర్తైన తర్వాత, క్యాంపస్ క్రూసేడ్ మిషనరీలు ఈ సినిమాను మారుమూల గ్రామాల్లో ప్రొజెక్టర్లతో ప్రదర్శించేవారు.

సినిమా ఎఫెక్ట్​.. మతం మార్చుకున్న 20 కోట్ల మంది..
1980వ దశకంలో వీహెచ్ఎస్ (VHS) వీడియో టేపులు పెరగడం వల్ల ఈ సినిమా మరింత మందికి చేరువైంది. ఏదేమైనా థర్డ్​ వరల్డ్​ కంట్రీస్ (మూడో ప్రపంచ దేశాలు)​గా పిలిచే దేశాల్లోనూ ఔట్ డోర్ ప్రదర్శనలు కొనసాగాయి. మిషనరీలు.. ఈ సినిమాతో పాటు ఆహారాన్ని పంపిణీ చేయడం, నీటిని ఇవ్వడం లాంటి చేశారు. ఆస్పత్రుల నిర్వాహకులు కూడా ఈ సినిమాను ప్రదర్శించే వారు. క్యాంపస్ క్రూసేడ్ అంచనా ప్రకారం ఈ సినిమా చూసిన తర్వాత 200 మిలియన్లకు పైగా ప్రజలు క్రైస్తవ మతంలోకి మారారు. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు కొనసాగుతున్నందున 2025 నాటికి, 10 బిలియన్లకు పైగా ప్రేక్షకులు ఈ సినిమాను చూస్తారని అంచనా. ది న్యూయార్క్ టైమ్స్ వార్తా సంస్థ.. ఈ సినిమాను అత్యధిక మంది చూసిన సినిమాగా పేర్కొంది.

గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం ఈ సినిమా.. అత్యధిక మందికి చేరుకోగలిగింది. 'జీసస్' సినిమా ఇప్పటివరకు 2043 భాషల్లోకి అనువాదమైంది. అలాగే ప్రస్తుతం ఈ సినిమాను Jesusfilm.org ద్వారా ఆన్లైన్ చూడటానికి కూడా అవకాశం ఉంది. 'జీసస్' సినిమా.. టెక్నాలజీతో పాటు పోటీ పడి ప్రజల్లోకి చొచ్చుకుపోయే మార్గాన్ని మార్చుకుంటూ వచ్చింది. ఈమధ్య కాలంలో బాగా పాపులర్ అయిన వీడియో స్ట్రీమింగ్ వెబ్ సైట్ యూట్యూబ్ ద్వారా కూడా జనాలకు చేరువైంది. ఇంటర్నెట్ వినియోగం పెరిగిన నేపథ్యంలో ఈ సినిమా మరింత మందికి అందుబాటులోకి వచ్చింది.

బ్లూ రేలో 'జీసస్'..
టెక్నాలజీతో పోటీపడుతూ 'జీసస్' టెక్నాలజీకి తగ్గట్టుగా మారుతూ వచ్చింది. 2014లో ఈ సినిమా బ్లూరే వర్షన్ విడుదలైంది. డాల్బీ డిజిటల్ 5.1 సౌండ్​తో ఈ సినిమా ఇప్పటికే ప్రేక్షకులను ఆదరిస్తోంది. మరిన్ని భాషాల్లోకి ఈ సినిమాను అనువదించడానికి.. క్యాంపస్ క్రూసేడ్ ఇప్పటికీ తన వెబ్ సైట్ ద్వారా విరాళాలను సేకరిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 7 వేల భాషలు మాట్లాడుతుండగా.. జీసస్ సినిమా మరిన్ని భాషల్లోకి అనువాదానికి సిద్ధమవుతోంది.

ABOUT THE AUTHOR

...view details