ఒకరు ఫ్యామిలీ ప్యాక్‌తో నవ్వించే కమెడియన్ మాత్రమే కాదు.. సిక్స్ ప్యాక్‌తో అలరించే హీరో కూడా. ఇక మరొకరు డైలాగ్స్‌తో విజిల్స్ కొట్టించే రైటర్ మాత్రమే కాదు.. ఫన్నీ ఎంటర్‌టైనర్‌తో బిందాస్ ఎంటర్‌టైనింగ్ ఇస్తున్న డైరెక్టర్ కూడా. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్‌తో వచ్చిన క్రేజీ స్టార్స్ సునీల్, అనిల్ రావిపూడి ఇద్దరు ఆలీతో చెప్పిన ముచ్చట్లేంటో చూద్దాం.
అనిల్‌తో మొదటిసారి పనిచేసినట్లు ఉన్నారు. ఎలా అనిపించింది?
సునీల్:అనిల్ దర్శకత్వంలో నటించడం ఇదే మొదటిసారి. ఇంతకు ముందు 'గౌతమ్ ఎస్‌ఎస్‌సీ', 'బాస్' సినిమాల షూటింగ్‌లో కలిశానంతే. అనిల్ దర్శకత్వంలో నటించడం అద్భుతమైన అనుభూతి. చాలా సులువుగా ఉంటుంది. శ్రమంతా ఆయనే పడతారు. మనకు కష్టం లేకుండా చేస్తారు. మళ్లీ ఎప్పుడెప్పుడు అనిల్‌తో పని చేస్తానా? అని ఉంది.
'ఎఫ్3' షూటింగ్‌లో 40రోజులు పాల్గొన్నారా?
సునీల్:దాదాపు 70 రోజులు పాల్గొన్నా. షూటింగ్ జరుగుతున్న సమయంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్, రాజేంద్రప్రసాద్, మీరు(ఆలీ), వెన్నెల కిశోర్, పృథ్వీ, రఘుబాబు ఇలా చాలా మంది ఆర్టిస్టులతో కలిసి ఉండటం చాలా సంతోషానిచ్చింది. నేను ఇంత మందితో కలిసి నటించడం ఇదే మొదటిసారి.
ఒంగోలులో డాడీ కాకుండా, హైదరాబాద్‌లో డాడీ ఎలా ఉన్నారు?
అనిల్ రావిపూడి:హైదరాబాద్‌లో డాడీ బ్రహ్మాండంగా ఉన్నాడు(నవ్వుతూ). నేను రాజేంద్రప్రసాద్‌ని 'డాడీ' అని పిలుస్తాను. నేను తీసిన ప్రతి సినిమాలో ఆయన ఉంటారు. 'ఎఫ్3'లో కూడా నిజాయతీ గల పోలీస్ ఆఫీసర్‌గా నటించారు. ఇక ఒంగోలులో ఉంటున్న మా నాన్న కూడా బాగున్నారు.
'ఎఫ్4' తీస్తారా?భవిష్యత్తులో కామెడీ సినిమాలే తీస్తారా. యాక్షన్‌వి కూడా తీస్తారా?
అనిల్:'ఎఫ్3'ని ప్రేక్షకులు ఆదరిస్తే కచ్చితంగా 'ఎఫ్4' తీస్తాను. నేను చేసిన సినిమాల్లో యాక్షన్‌వి చాలానే ఉన్నాయి. 'పటాస్', 'సరిలేరు నీకెవ్వరు', 'రాజా ది గ్రేట్' సినిమాల్లో ఎంటర్‌టైనింగ్ ఎంత ఉంటుందో అంతకు డబుల్ యాక్షన్ ఉంటుంది.
అనిల్‌లో మీకు నచ్చిన మూడు గుణాలు చెప్పండి?
సునీల్:ఎప్పుడూ హుషారుగా, నవ్వుతూ ఉంటారు. మరొకటి తను కష్టపడే విధానం. అన్నింటికంటే ముఖ్యమైంది తనకు అసలు కోపం రాదు. ఎవ్వరికీ ఏ విషయంలో నో చెప్పడు.
ఎవరికైనా స్నేహితులు మన వయసుకు దగ్గరగా ఉండే వాళ్లు ఉంటారు. మీకు ముసలివాళ్లు ఎక్కువ మంది ఉన్నారుట నిజమేనా?
సునీల్:నిజమే. నాకు 6 ఏళ్లు ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. ఇక ఇంట్లో మగవాళ్లెవ్వరూ లేరు. నేను ఒక్కడి. దీంతో అన్ని చూసుకునేవాడిని. నా కంటే పెద్దవాళ్లు మాట్లాడేటప్పుడు నాకు చాలా ఆసక్తి ఉండేది. అందుకే నా స్నేహితుల్లో నా కంటే పెద్దవాళ్లుంటారు.
భీమవరం నుంచి హైదరాబాద్ ఇష్టంతో వచ్చావా?
సునీల్:ఆర్థికంగా మా పరిస్థితి బాగానే ఉండేది. హైదరాబాద్ రావడం, సినిమాల్లో నటించడం నా కల. ఇంట్లో వాళ్లు చదువుకోమన్నారు. పీజీ ఒక సంవత్సరం చదివా. నాకున్న బైక్ అమ్మేసి ఆ డబ్బుతో హైదరాబాద్ వచ్చేశా.
మొదట హీరో అవ్వాలనుకుని మళ్లీ విలన్ అవ్వాలని అనుకున్నావు ఎందుకు?
సునీల్:మొదట హీరో అవ్వాలని అనుకున్నా. ఇంటర్‌లో ఉన్నప్పుడు హీరోగా నెగ్గలేమేమో అనిపించింది. ఆ సమయంలో మోహన్‌బాబు విలన్‌గా చేసిన 'దేవత' లాంటి సినిమాలు చూసి ఆయన లాగా అవుదామనుకున్నా.
'ఎఫ్3' సినిమా షూటింగ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌లో అన్ని రోజులు ఎందుకుచేశారు?
అనిల్:ఫలక్‌నుమా ప్యాలెస్ చాలా ఖరీదైంది. కరోనా కారణంగా చాలా రోజులు షూటింగ్ వాయిదా పడింది. అందుకే ఎక్కువ రోజులు చేయాల్సి వచ్చింది. 'ఎఫ్3' షూటింగ్ అంతా ఇండియాలోనే చేశా.
మీ సినిమాల గురించి ఇంట్లో చర్చ జరుగుతుందా?