ఎవరైనా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌ను కలిస్తే జాగ్రత్తగా ఉండాలని అఖిల్ అక్కినేని పేర్కొన్నారు. 'అవును' అంటూ శర్వానంద్ ఆయనకు మద్దతు పలికారు. ఈ ఇద్దరు ఎందుకు కలిశారు? ప్రభాస్ గురించి ఎప్పుడు, ఎందుకు మాట్లాడారు అని అనుకుంటున్నారా? అసలేం జరిగిందంటే..
శర్వానంద్ హీరోగా తెరకెక్కిన 'ఒకే ఒక జీవితం' చిత్రం ఈ నెల 9న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ప్రచారాన్ని వేగవంతం చేస్తోంది. ఈ క్రమంలో 'అమ్మ చేతి వంట' అనే చిట్‌చాట్‌ని ప్లాన్ చేసింది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన అమల అక్కినేని తోపాటు శర్వానంద్, అఖిల్ 'అమ్మ చేతి వంట'లో పాల్గొని, రుచి చూశారు. తాను వంట చేస్తున్న సమయంలో 'ప్రభాస్ ఫూడీ (ఆహారాన్ని అమితంగా ఇష్టపడే వ్యక్తి) అని విన్నా' అని అమల చెప్పగా.. తనను కలిస్తే జాగ్రత్తగా ఉండాలని అఖిల్ నవ్వుతూ సమాధానం ఇస్తారు. 'ఇక చాలు తినలేను అని చెప్పినా ప్రభాస్ వదిలిపెట్టరు' అనే ఉద్దేశంలో అఖిల్ మాట్లాడారు.