అప్పటివరకు తమ కళ్ల ముందే ఆడుకుంటున్న ఆ బాలుడు అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. పక్కింటి పిల్లలతో ఆడుకుంటున్నాడేమో అనుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఎంతసేపైనా ఇంటికి రాకపోవడంతో చుట్టుపక్కల వాళ్లని అడిగారు. దరిదాపుల్లో ఎక్కడా ఆచూకీ దొరకకపోవడంతో కంగారుపడ్డారు. తెలిసిన వారి ఇళ్లలో.. బంధువులు, స్నేహితులను అడిగారు. ఎంతకీ జాడ కనిపించకపోవడం వల్ల చివరకు పోలీసులను ఆశ్రయించారు.
Tragedy : తుర్కపల్లిలో అదృశ్యమైన బాలుడి ఘటన విషాదాంతం
09:16 September 16
ఆడుకుంటూ కనిపించకుండా పోయి.. చివరకు..
మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలింపు మొదలుపెట్టారు. అదృశ్యమైన తమ చిన్నారి ఆడుకుంటూ ఎక్కడో దారి తప్పి ఉంటాడని.. తప్పకుండా తమకు దొరుకుతాడని ఆశించిన ఆ తల్లిదండ్రులకు కడుపుకోతే మిగిలింది. ఐదేళ్ల ఆ పసివాడు నీటికుంటలో విగతజీవిగా కనిపించడం చూసి ఆ కన్నపేగు తల్లడిల్లింది. పనిపక్కన పెట్టి కాసేపు ఆ చిన్నారిని చూసుకుంటే.. తమ పిల్లవాడు దక్కేవాడని ఆ కన్నవారు పెట్టిన శోకం చూసి అక్కడున్న వారి గుండె ముక్కలయింది.
మేడ్చల్ జిల్లా తుర్కపల్లిలోని ఓ వెంచర్లో ఛత్తీస్‌గఢ్‌కు చెందిన దంపతులు పనిచేస్తున్నారు. తల్లిదండ్రులు పనిచేస్తుండగా.. వారి ఐదేళ్ల కుమారుడు యువరాజ్ అక్కడే ఆడుకుంటున్నాడు. అకస్మాత్తుగా బాలుడు కనిపించకపోవంతో కంగారుపడ్డ కన్నవారు చుట్టుపక్కల వెతికారు. ఎంతకీ జాడ కనిపించకపోవడం వల్ల ఆందోళనకు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు బుధవారం సాయంత్రం బాలుడి ఆచూకీ కోసం గాలించారు. చివరకు రాత్రి పూట ఓ నీటికుంటలో ఆ పసివాడి మృతదేహం కనిపించింది. నీటికుంటలో ప్రాణంలేని యువరాజ్‌ను చూసి ఆ కన్నపేగు గుండెలవిసేలా రోదించింది. వారి రోదనలు చూసి అక్కడున్నవారంతా కంటతడి పెట్టారు.