ATM Vehicle driver escapes with cash: ఆంధ్రప్రదేశ్లోని కడప నగరంలో వివిధ జాతీయ బ్యాంకులకు సంబంధించిన ఏటీఎం మిషన్లలో నిల్వచేసే లక్షల రూపాయల నగదు ఉన్న వాహనంతో డ్రైవర్ పరారయ్యాడు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన డబ్బును సీఎంఎస్ ఏజెన్సీ రోజువారిగా నగదును ఆయా ప్రాంతాల్లోని ఏటీఎం కేంద్రాల్లో నిల్వ చేస్తుంది. వాహనంలో సాంకేతిక సిబ్బంది, ఓ సెక్యూరిటీ గార్డు కూడా ఉంటారు.
ఇవాళ సాయంత్రం దాదాపు 80 లక్షల రూపాయలతో సీఎంఎస్ ఏజెన్సీ వాహనం ఎస్బీఐ బ్యాంకు నుంచి బయలుదేరింది. కడపకు చెందిన షారుఖ్ వాహన డ్రైవర్గా ఉన్నాడు. కడప ఐటీఐ కూడలి వద్దనున్న ఎస్బీఐ ఏటీఎంలో సిబ్బంది కొంత నగదు పెడుతుండగా.. సెక్యూరిటీ గార్డు ఏటీఎం కేంద్రం వద్ద కాపలా ఉన్నాడు. ఇదే అదునుగా చూసిన డ్రైవర్ షారుఖ్ వాహనంతో ఉడాయించాడు.