హైదరాబాద్‌లో గంజాయి, మత్తు పదార్థాల రవాణా(ganja smuggling in telangana)పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా సరిహద్దుల నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, గోవా తదితర ప్రాంతాలకు యథేచ్చగా రవాణా(ganja smuggling in telangana) చేస్తున్న వారిని నిలువరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకు సంబంధించి రెండు నెలలుగా సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో 132 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. 257 మందిని పోలీసులు అరెస్టు చేశారు. 263 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఎమ్డీఎమ్ఏ, ఎక్స్‌టాసీ మత్తు పదార్ధాలను పట్టుకున్నారు. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద 80 మంది నేరగాళ్లపై పీడీ చట్టం నమోదు చేశారు.
నగరంలో గంజాయి, ఎమ్డీఎమ్ఏ మత్తుపదార్థం రవాణా చేస్తున్న 8 మందిని సైబరాబాద్ మాదాపూర్, బాలనగర్ ఎస్వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు. పాతబస్తీ చార్మినార్‌కు చెందిన యాసిన్ హాసన్, లక్డీకపూల్ వాసి రాకేష్, నిహాల్ అహ్మద్, యాసిన్ ఖాన్, ఇఫ్‌తకార్ అహ్మద్‌తో పాటు మరో ముగ్గురిని వేర్వేరు కేసుల్లో అదుపులోకి తీసుకున్నారు. 45 కిలోల గంజాయితో పాటు 50 గ్రాముల ఎమ్డీఎమ్ఏ పట్టుకున్నామని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. నిందితుల నుంచి 22 వేలు, 11 సెల్‌ఫోన్లు, మూడు కార్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, మత్తు పదార్థాల రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర హెచ్చరించారు.