loan App agents harassment : అప్పు కావాలంటూ సంప్రదించకపోయినా... బాధితుల చరవాణులకు సంక్షిప్త సందేశాలు పంపించి వారి బ్యాంక్ ఖాతాల్లో నగదు జమచేసి వేధింపులు.. చిత్రహింసలు పెడుతున్న రుణయాప్‌ల నిర్వాహకులు కొత్త పంథాను ఎంచుకున్నారు. రుణం వసూలు చేసుకునేందుకు అప్పు తీసుకున్న వారి ఫోన్‌లో మహిళలు.. యువతుల కాంటాక్ట్స్‌ను లక్ష్యంగా చేసుకుని వారి వాట్సాప్ డీపీలను సేకరించి వారి ఫొటోలను నగ్నచిత్రాలుగా మార్చి వారికే పంపుతున్నారు.
‘‘మీ స్నేహితుడు రూ.లక్ష రుణం తీసుకున్నాడు... వెంటనే చెల్లించమని చెప్పండి.. లేదంటే నగ్న ఫొటోలు వీడియోలుగా మారతాయ్’’అంటూ ఫోన్లో బెదిరిస్తున్నారు.
ఫోన్ కాంటాక్ట్‌లకు అనుమతి తీసుకుని..వ్యక్తిగత పూచీకత్తు లేకుండా రుణాలు ఇస్తున్న నిర్వాహకులు రుణయాప్ డౌన్‌లోడ్ చేసుకోమంటున్నారు. రుణం ఇచ్చేముందు ఆధార్ కార్డు, చరవాణిలో కాంటాక్ట్‌లిస్ట్ కావాలంటూ అనుమతులు తీసుకుంటున్నారు. అనంతరం నాలుగు రోజులకే ఫోన్ చేసి అసలు, వడ్డీ సొమ్ము కట్టాలంటూ ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారం, పదిరోజుల వరకూ గడువు ఉంది కదా అంటూ బాధితులు చెబుతున్నా.. వినకుండా వరుసగా ఫోన్లు చేస్తున్నారు.
దారుణ యాప్‌లు.. "వాట్సాప్ డీపీల ద్వారా కొద్దినెలల నుంచి సైబర్ నేరాలు వేగంగా పెరుగుతున్నాయి. రుణయాప్ నిర్వాహకులు యువతులు, మహిళలను లక్ష్యంగా చేసుకుని బెదిరిస్తున్నారు. ఎవరైనా సరే.. యాప్‌ల ద్వారా రుణం తీసుకోకూడదు. ఒకవేళ తీసుకున్నా... ఫోన్ కాంటాక్ట్ లిస్ట్ ఇవ్వకూడదు. వేధింపులు మొదలైతే పోలీసులకు సమాచారం ఇవ్వండి." -కేవీఎం ప్రసాద్, ఏసీపీ సైబర్‌క్రైమ్స్