ఒకప్పుడు దొంగలు ఇళ్లకు కన్నాలేసి.. బీరువాలు పగలగొట్టి, అయినకాడికి ఎత్తుకెళ్లేవారు. ఇప్పుడు ఉన్నచోటి నుంచే ఆన్‌లైన్ ద్వారా సొత్తు దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు (Cybercriminals). మనతోనే తాళాలు (పాస్‌వర్డ్‌లు) ఇప్పించుకుని, మనం కళ్లు తెరిచి చూసేలోగా బ్యాంకు ఖాతాలు ఖాళీ చేస్తున్నారు. ఫోన్ చేసి నాలుగు మాయమాటలు చెప్పి, డెబిట్‌కార్డుకు ఉండే నాలుగంకెల పిన్ నెంబరు తెలుసుకుని.. గుల్ల చేస్తున్నారు.
ఇదే విధంగా బ్యాంక్ అధికారులమని.. అమాయకులకు ఫోన్లు చేసి.. వారి ఖాతాల నుంచి డబ్బును తస్కరిస్తున్న ముఠాను సైబర్‌బాద్ సైబర్ క్రైమ్ పోలీసులు బట్టబయలు చేశారు. దిల్లీ, ఉజ్జయినిలోని వారి స్థావరాలపై దాడులు చేశారు. అక్కడి పోలీసుల సహాయంతో కాల్సెంటర్లోని మొత్తం 23 మందిలో 16 మందిని అరెస్ట్ చేశారు.
నిందితులు బ్యాంక్ అధికారులమంటూ పలువురి ఖాతాల నుంచి.. విడతల వారీగా రూ.3 కోట్లు కాజేసినట్లు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో దిల్లీ వెళ్లిన ప్రత్యేక బృందం కాల్ సెంటర్‌పై దాడి చేసింది. 16 మంది పట్టుకోగా మరో ఏడుగురు పరారయ్యారు. 16 మందిలో 9 మందిని దిల్లీలో.. 7గురిని ఉజ్జయినిలో పట్టుకున్నట్లు సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. నిందితుల (Cybercriminals) నుంచి ల్యాప్‌టాప్‌లు, సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.