తెలంగాణ

telangana

By

Published : Sep 20, 2021, 10:03 AM IST

ETV Bharat / crime

Road Accidents in Telangana: రక్తమోడిన రహదారులు... 8 మంది దుర్మరణం

ఆదివారం నల్గొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో రహదారులు (Road accidents) రక్తమోడాయి. జిల్లాల్లోని మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 8 మంది (8 people died) మృత్యువాతపడ్డారు. బాధిత కుటుంబాలు (families) విషాదంలో మునిగిపోయాయి.

Road Accidents in Telangana
Road Accidents in Telangana: రక్తమోడిన రహదారులు... 8 మంది దుర్మరణం

విదేశాల్లో ఉన్నత ఉద్యోగంలో చేరి కుటుంబంతో మరింత ఆనందంగా జీవిద్దామనుకున్న ఓ యువకుడి ఆశలు ఆవిరయ్యాయి.. పౌరోహిత్యానికి వెళ్తున్న ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిశాయి.. మొక్కులు చెల్లించుకొని సంతోషంగా ఇంటికి తిరుగుపయనమైన ఓ కుటుంబం విషాదంలో మునిగిపోయింది.. ఆదివారం నల్గొండ, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో జరిగిన మూడు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (road accidents) 8 మంది (8 people died) మృత్యువాతపడ్డారు.

నల్గొండ జిల్లాలో రెండు ప్రమాదాలు 200 మీటర్ల దూరంలోనే చోటుచేసుకున్నాయి. ఆయా ఘటనలకు సంబంధించి పోలీసులు, మృతుల బంధువులు తెలిపిన వివరాలివీ.. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం అయ్యపురాజుపాలేనికి చెందిన కదిరి గోపాల్‌రెడ్డి(31) రాజస్థాన్‌లో మైనింగ్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. ఆయన భార్య రచన (31), కుమార్తె రియాన్షితో కలిసి అక్కడే ఉంటున్నారు. గోపాల్‌రెడ్డికి దక్షిణాఫ్రికాలో మరో ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లడానికి ప్రస్తుత ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఇంటి సామగ్రిని ట్రాన్స్‌పోర్టు లారీలో వేశారు. భార్య, కుమార్తెతోపాటు రాజస్థాన్‌లో తనతో పనిచేస్తున్న కృష్ణా జిల్లా అమ్మవారితోట వాసి నాగమళ్ల ప్రశాంత్‌కుమార్‌(24)తో కలిసి శనివారం కారులో సొంత ఊరుకు బయలుదేరారు. మార్గమధ్యలో ఆదివారం హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం శివారులో ముందువెళ్తున్న కంటెెయినర్‌ లారీని వెనుకనుంచి వీరి కారు ఢీకొట్టి, పల్టీలు కొడుతూ వెళ్లి రోడ్డు పక్కన చెట్టును ఢీకొట్టి నిలిచింది. ప్రమాదంలో గోపాల్‌రెడ్డి, ప్రశాంత్‌ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో కారులో ఇరుకున్న తల్లీకుమార్తెలు రచన, రియాన్షిలను స్థానికులు, పోలీసులు పొక్లెయిన్‌ సాయంతో వెలికితీసి కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రచన మృతిచెందారు.

రక్తమోడుతున్న తల్లిదండ్రులను చూసి ఐదేళ్ల రియాన్షి తీవ్ర భయాందోళనకు గురైంది. స్వల్ప గాయాలతో బయటపడిన చిన్నారి భయంతో వణికిపోతూ మమ్మీ అంటూ రోదించడం చూపరులను కంటతడి పెట్టించింది.

మరో ప్రమాదంలో..

కారులో ఇరుకున్న తల్లీకుమార్తెలను పొక్లెయిన్‌ సాయంతో బయటకుతీసే క్రమంలో రహదారిపై వాహనాలు నిలిచాయి. ఈ ప్రమాద స్థలానికి 200 మీటర్ల దూరంలో ఆగి ఉన్న లారీని హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట వైపు వెళ్తున్న మరో కారు వెనుక నుంచి ఢీకొట్టింది. కారులో ప్రయాణిస్తున్న బడంగ్‌పేట్‌కు చెందిన రూమాల వినయ్‌(21) అక్కడిక్కడే మృతిచెందారు. రంగారెడ్డి జిల్లా దోమ మండలం మోత్కూరుకు చెందిన జంగం శివప్రపసాద్‌(23)కు తీవ్రగాయాలు కావడంతో కామినేని ఆసుపత్రికి తరలించారు. ఆయన అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందారు. వీరు పురోహితులు. సూర్యాపేటలో రుద్రాభిషేకంలో పాల్గొనేందుకు వెళ్తున్నారని వారి స్నేహితులు తెలిపారు. ఈ రెండు ప్రమాదాలకూ అతివేగం, నిర్లక్ష్యమే కారణమని పోలీసులు భావిస్తున్నారు.

మొక్కులు చెల్లించుకొని వస్తుండగా..

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం జటావత్‌ తండాకు చెందిన జటావత్‌ రాజేశ్‌(అలియాస్‌ రాజా) తన నాలుగేళ్ల కుమారుడు బాలపరమేశ్‌ పుట్టు వెంట్రుకల మొక్కు చెల్లించేందుకు శనివారం ఉదయం అదే గ్రామానికి చెందిన జటావత్‌ శ్రీను ఆటోని అద్దెకు మాట్లాడుకొని నల్లమలలోని మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి బయలు దేరారు. ఆటోలో రాజేశ్‌, ఆయన భార్య చంద్రకళ, కుమారుడు బాలపరమేశ్‌, పెద్దమ్మ పోలి, అన్న కూతురు శిరీష, చంద్రకళ అక్క జ్యోతిబాయి, మామ చందూనాయక్‌(అలియాస్‌ జమ్ర), డ్రైవర్‌ శ్రీను ఉన్నారు. శనివారం రాత్రి ఆలయ ప్రాంగణంలోనే నిద్రించి ఆదివారం ఉదయం మొక్కులు చెల్లించారు. 11 గంటలకు మద్దిమడుగు నుంచి బయలుదేరారు. రెండు కి.మీ.ల దూరం ప్రయాణించగానే ఆటోను దేవరకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఆటో ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. ఆటో డ్రైవర్‌ శ్రీను(35), చందూనాయక్‌(55), పోలి(60) అక్కడికక్కడే మృతిచెందారు. డ్రైవర్‌ శ్రీను మృతదేహం ఆటోలోనే ఇరుక్కుపోగా పోలీసులు శ్రమించి బయటకు తీశారు. చందూనాయక్‌, పోలీల మృతదేహాలు ఆటో నుంచి ఎగిరిపడ్డాయి. క్షతగాత్రులు రాజేశ్‌, చంద్రకళ, జ్యోతిబాయి, శిరీష, బాలపరమేశ్‌లను స్థానికులు ‘108’ అంబులెన్సులో అచ్చంపేట ఆసుపత్రికి.. అక్కడి నుంచి హైదరాబాద్‌కు తరలించారు. వీరిలో జ్యోతి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చందూనాయక్‌ నల్గొండ జిల్లా చందంపేట మండలవాసి కాగా.. ప్రస్తుతం గుంటూరు జిల్లా గురజాలలో నివసిస్తున్నారు. బస్సు డ్రైవర్‌ శ్రీను నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని.. అతడిపై నమోదు చేశామని సీఐ ఆదిరెడ్డి తెలిపారు. బస్సులో ఉన్న వారెవరికీ గాయాలు కాలేదని చెప్పారు.

ఇదీ చూడండి:Accident: నాగర్‌కర్నూల్ జిల్లాలో ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

ABOUT THE AUTHOR

...view details