Lumpy skin disease in Telangana: రాష్ట్రంలోని పశువుల్లో లంపీస్కిన్ వ్యాధి చాపకింద నీరులా విస్తరిస్తోంది. మహారాష్ట్ర, పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్తాన్, ఒడిశా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యాధితో లక్షల్లో పశువులు మృత్యువాత పడుతున్నాయి. తాజాగా రాష్ట్రంలోనూ లంపీస్కిన్ కేసులు నమోదవుతుండటం ఆందోళనకు గురి చేస్తోంది. పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన ఈ వ్యాధి.. ఆవు, గేదె జాతి పశువుల్లో తీవ్ర ప్రభావం చూపుతోంది.
తాజాగా నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలో లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. మండలంలోని తుంగిని, నలేశ్వర్ గ్రామాల్లో 5 ఆవులకు గడ్డలు కనిపిస్తున్నాయని రైతులు పశు వైద్య అధికారికి సమాచారం అందించారు. పరిశీలించిన వైద్యాధికారులు లంపీస్కిన్ వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నట్లు చెప్పారు. వ్యాధి లక్షణాలున్న ఆవుల నుంచి రక్త నమునాలను సేకరించి ల్యాబ్‌కు పంపించారు. ఎల్లారెడ్డిలో ఈ వ్యాధి లక్షణాలతో లేగ దూడ మృతి చెందింది. నందిపేట్, బాన్సువాడల్లోనూ పశువులకు వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయి.