Karimnagar Hospital Problems: ఉత్తర తెలంగాణలో కీలకమైన ఆసుపత్రిగా ఉన్న కరీంనగర్ సర్కార్ దవాఖాన.... రోగులు, సిబ్బందికి పరీక్షగా మారింది. ఆసుపత్రిలోని ఐపీ, సర్జికల్, జ్వర వార్డుల్లో.. ఏటా వర్షకాలంలో పెచ్చులూడి పడిపోవటం రివాజుగా మారింది. భవనాలకు శాశ్వత మరమ్మతులు చేయకపోవడం వల్ల.. లక్షలు ఖర్చుపెట్టి చేస్తున్న పనులు ఫలితమివ్వడంలేదు. నాణ్యత లోపించడం వల్ల ఏటా భవనం పైకప్పు నుంచి నీరు కారుతోంది. రోగులు, విధులు నిర్వహిస్తున్న సిబ్బంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఆసుపత్రిలో ఉండాల్సిన దుస్థితి నెలకొంది.
వేలాది మందికి సంజీవనిలా మారిన ఆసుపత్రికి రోగుల తాకిడి పెరిగింది. భారీ వర్షాలు, వరదల కారణంగా ఆసుపత్రిలో ఉన్న పడకలు సరిపడక వరండాలో మడత మంచాలు వేసి రోగులకు చికిత్స అందిస్తున్నారు. ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసి వైద్యం చేస్తున్నారు. జ్వరపీడితులు , ఇతర వ్యాధులతో వచ్చే వారితో దవాఖాన కిటకిటలాడుతోంది.
జ్వరం వచ్చినవారందరికీ కరోనా వస్తుందనే భయమేమీ లేదని వైద్యులు భరోసా ఇస్తున్నారు. వర్షకాలంలో తాగునీరు, ఆహారం విషయంలో నిర్లక్ష్యం వహిస్తే డయేరియా, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ బారినపటడం ఖాయమని హెచ్చరిస్తున్నారు . కాచి చల్లార్చిన నీటినే తాగాలని, బయటి తిండి తినకపోవడమే శ్రేయస్కరమని సూచిస్తున్నారు . పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.