తెలంగాణ

telangana

ETV Bharat / city

కరీంనగర్ జిల్లా శివారు ప్రాంతాలకు పొంచి ఉన్న ప్రమాదం - lands disputs

'దీపం ఉన్నప్పుడు ఇళ్లు చక్కబెట్టుకోవాలి' అన్న చందంగా... కొందరు నాయకుల ఆక్రమణలు కొనసాగుతున్నాయి. ఎక్కడ ఖాళీ జాగా కన్పిస్తే అక్కడ... తమ చేతివాటం చూపిస్తున్నారు. చెరువులు, కుంటలు అంటూ తేడా లేకుండా మాయం చేస్తున్నారు. వారి భూకబ్జాల పర్వంతో... ప్రజలతో పాటు నగరాలను కూడా ప్రమాదాల్లో నెట్టేస్తున్నారు.

government lands occupation in karimnagar outscats
government lands occupation in karimnagar outscats

By

Published : May 2, 2021, 5:36 PM IST

హైదరాబాద్, వరంగల్ శివార్లలో ఉన్న చెరువులు, కుంటలను ఆక్రమించుకుని నిర్మాణాలు చేపట్టడం వల్ల... గతంలో భారీ వర్షాలకు పట్టణాలు అతలాకుతలం అయ్యాయి. అదే తరహాలో కరీంనగర్​కు కూడా ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్​లోని శివారు ప్రాంతమైన రేకుర్తితో పాటు రేకుర్తి లయన్స్​ క్లబ్ వెళ్లే రహదారిలో నిర్మాణం చేపడుతున్న ఇండిపెండెంట్​ భవనాలు ప్రమాదాలకు నెలవవుతున్నాయి. చింతకుంట, శాంతినగర్​కు ఆనుకొని ఉన్న తూముకుంట... ఆక్రమణలకు గురవుతోంది. అధికార పార్టీ నాయకుల అండదండలతో రియల్టర్లు ఆక్రమణలు చేయడానికి వెనుకాడడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెవెన్యూ అధికారులు లంచాలకు కక్కుర్తిపడుతూ... ఇవేవీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు.

శివారు గ్రామాల సర్పంచులు, కార్పొరేటర్లు... తమ ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సింది పోయి... చేతివాటం చూపిస్తున్నారు. గుట్టలు ఆనుకొని ఉన్న స్థలాల్లో అక్రమ నిర్మాణాలు చేపడుతూ... గుట్టుచప్పుడు కాకుండా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో మంత్రి అనుచరులు ఉండడం వల్ల అధికారులు ముందుకు రావడం లేదని ప్రజల ప్రధాన అభియోగం. ప్రభుత్వ భూములకు హద్దులు పెట్టాల్సిన అధికారులే పట్టనట్లు వ్యవహరించడంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ ఆక్రమణలు ఇలాగే కొనసాగితే గ్రామీణ ప్రాంతాలు భారీ వర్షాలతో నీటిలో మునిగిపోయే అవకాశం లేకపోలేదు. అధికారులు ఇకనైనా స్పందించి... చెరువులు, కుంటలను ఆక్రమణలకు గురికాకుండా చూసినట్లయితే భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందని గ్రామస్థులు కోరుతున్నారు.

ఇదీ చూడండి: జమున కోళ్ల ఫారాల వద్ద 'ప్రభుత్వ భూమి' బోర్డులు

ABOUT THE AUTHOR

...view details