Varavara Rao Bail Extended: మావోయిస్ట్ లింకుల కేసులో లొంగిపోవడానికి విరసం నేత వరవరరావు(83)కు బెయిల్ గడువును బాంబే హైకోర్టు మరోసారి పొడిగించింది. చివరి ఉత్తర్వుల నేపథ్యంలో ఫిబ్రవరి 5న వరవరరావు లొంగిపోవాల్సి ఉండగా.. ధర్మాసనం ముందుకు బెయిల్ పిటిషన్ విచారణకు వచ్చింది. జస్టిస్ ఎస్‌ఎస్ షిండే, జస్టిస్ ఎన్‌ఆర్ బోర్కర్‌లతో కూడిన ధర్మాసనం వరవరరావు బెయిల్ పిటిషన్లపై అత్యవసర విచారణ చేపట్టింది. వరవరరావు తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం.. బెయిల్ గడువును ఫిబ్రవరి 28 వరకు పొడిగించింది.
బెయిల్ పొడిగింపుల పర్వం..
ఎల్గార్ పరిషద్ కేసులో అరెస్టయిన వరవరరావు ఆరోగ్య కారణాల దృష్ట్యా 2021 ఫిబ్రవరిలో హైకోర్టు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. సెప్టెంబర్ 5న లొంగిపోవాల్సి ఉండగా.. బెయిల్‌ను పొడిగించాలని కోరుతూ ఒక పిటిషన్‌ను దాఖలు చేశారు. అనారోగ్య కారణాల వల్ల శాశ్వత బెయిల్ కోరుతూ మరొక పిటిషన్ దాఖలు చేశారు. అప్పటి నుంచి వివిధ కారణాలతో నవీ ముంబైలోని తలోజా జైలు అధికారుల ఎదుట లొంగిపోయేందుకు ఇచ్చిన గడువును హైకోర్టు పొడిగిస్తూ వస్తోంది. ప్రస్తుతం కూడా ఆయన ఆరోగ్య పరిస్థితి పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. మరోసారి బెయిల్ గడువును పొడిగిస్తూ.. తదుపరి విచారణను ఫిబ్రవరి 28కి వాయిదా వేసింది.