తెలంగాణ

telangana

ETV Bharat / city

కేంద్రీయ విద్యాలయాల్లో 767 పోస్టులు ఖాళీ - కేంద్రీయ విద్యాలయాల్లో పోస్టులు

Vacancies in Kendriya Vidyalayas : రాష్ట్రంలోని కేంద్రీయ విద్యాలయాల్లో 47%, జవహర్ నవోదయ విద్యాలయాల్లో 19% పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. కరోనా సమయంలో దేశంలోని వివిధ రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 23 లక్షల మేర తగ్గినట్లు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి రామేశ్వర్ తేలి వెల్లడించారు.

Vacancies in Kendriya Vidyalayas
Vacancies in Kendriya Vidyalayas

By

Published : Apr 5, 2022, 7:10 AM IST

Vacancies in Kendriya Vidyalayas : తెలంగాణలోని కేంద్రీయ విద్యాలయాల్లో 767 (47%), జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 76 (19%) పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. సోమవారం లోక్‌సభలో నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆమె బదులిచ్చారు. రాష్ట్రంలోని 35 కేంద్రీయ విద్యాలయాల్లో 39,418 మంది విద్యార్థులు చదువుకుంటున్నారని, ఈ స్కూళ్లకు 1,610 పోస్టులు మంజూరు చేయగా, ప్రస్తుతం 843 మందే పనిచేస్తున్నారని చెప్పారు. 9 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 4,598 మంది విద్యార్థులు చదువుతున్నారని, ఈ స్కూళ్లకు మంజూరు చేసిన 394 పోస్టుల్లో 318 మంది పనిచేస్తున్నారని వివరించారు.

కరోనా కాలంలో తగ్గిన 23 లక్షల మంది ఉద్యోగులు :కరోనా సమయంలో దేశంలో వివిధ రంగాల్లో ఉద్యోగుల సంఖ్య 23 లక్షల మేర తగ్గినట్లు కేంద్ర కార్మికశాఖ సహాయమంత్రి రామేశ్వర్‌ తేలి తెలిపారు. ఆయన సోమవారం లోక్‌సభలో తెరాస సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి అడిగిన ప్రశ్నకు బదులిచ్చారు. 2020 మార్చి 25న లాక్‌డౌన్‌ విధించడానికి ముందు దేశంలోని 8 రంగాల్లో 3.07 కోట్ల మంది పనిచేసేవారని, 2020 జులై నాటికి ఆ సంఖ్య 2.84 కోట్లకు తగ్గిందని చెప్పారు. పురుష ఉద్యోగుల సంఖ్య 16 లక్షల మేర, మహిళల సంఖ్య 7 లక్షల మేర తగ్గిపోయినట్లు వెల్లడించారు.

కేజీబీవీ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలి :కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో(కేజీబీవీల్లో) పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 377 నిబంధన కింద ఈ అంశాన్ని సోమవారం ఆయన లోక్‌సభ ముందుంచారు. తెలంగాణలో 475 కేజీబీవీలు, 96 జూనియర్‌ కళాశాలల్లో 14,250 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం సమాన పనికి సమాన వేతనం కింద వారికి వేతనాలు పెంచాలని, వారి సేవలను క్రమబద్ధీకరించాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details