హైదరాబాద్ ఉప్పల్లోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కొన్ని రోజులుగా రద్దీ వాతావరణం నెలకొంది. కొవిడ్ వ్యాక్సిన్ కోసం వచ్చేవారితో ప్రాంగణంలోకి అడుగు పెట్టేందుకు వీలులేని పరిస్థితి ఏర్పడింది. కరోనా నిర్ధరణ పరీక్షలు మినహా.. మిగతా అన్ని సేవలు స్థానికంగా అందుబాటులో ఉండటం వల్ల ప్రజలు పెద్దఎత్తున తరలివస్తున్నారు.
మరోవైపు టీకాల కోసం జనాలు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. ఆరోగ్య కేంద్రంలో కొవిషీల్డ్, కొవాగ్జిన్ రెండు రకాల టీకాలు అందుబాటులో ఉండటంతో స్థానికులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారూ వ్యాక్సిన్ కోసం ఇక్కడికి తరలివస్తున్నారు. ప్రతిరోజు దాదాపు 600 మందికి పైనే టీకాలు వేస్తున్నట్లు వైద్యాధికారులు చెబుతున్నారు. వారందరి వివరాలను ఆన్‌లైన్‌లో ఒకే కంప్యూటర్ ద్వారా నమోదు చేస్తున్నారు.