డ్రోన్‌తో ఓ మారుమూల గ్రామానికి మందులు పంపుతామని ఏరోజైనా అనుకున్నామా అని పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశ్నించారు. డ్రోన్ టెక్నాలజీ ప్రపంచానికి కొత్త కాంతిని తీసుకొస్తుందని, సాంకేతిక పరిజ్ఞానంలో భారతదేశం ప్రపంచానికి లీడర్‌గా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. శనివారం వికారాబాద్ జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్‌లో డ్రోన్లతో ఔషధాల సరఫరా (మెడిసిన్ ఫ్రం ది స్కై) ప్రారంభ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్, పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఔషధాలు నింపిన రెండు డ్రోన్ల (బ్లూ డాట్, టెక్ ఈగల్)ను సింధియా, కేటీఆర్ ప్రారంభించారు. ఇవి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతీయ ఆసుపత్రికి 5 నిమిషాల్లో మందులను తీసుకెళ్లాయి. అనంతరం సింధియా మాట్లాడుతూ.. డ్రోన్ పాలసీకి పది రోజుల క్రితం కేంద్రం ఆమోదం తెలిపిందని, ఆన్‌లైన్‌లో ఇలా దరఖాస్తు చేసే అలా అనుమతులు వచ్చేస్తాయని తెలిపారు. టెలిఫోన్, విమానం తరహాలో డ్రోన్ టెక్నాలజీ ఓ సంచలనంగా మారుతుందని పేర్కొన్నారు. అన్ని రాష్ట్రాలతో చర్చించి డ్రోన్ల వినియోగానికి మూడు రకాల జోన్లను ఏర్పాటు చేస్తామని, గ్రీన్ జోన్‌కు అనుమతులు అవసరం లేదని, ఎల్లో జోన్‌కు అనుమతులు తీసుకోవాల్సి ఉంటుందని, రెడ్ జోన్‌లో ఎవరికీ ప్రవేశం ఉండదని స్పష్టం చేశారు.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో ఈ పథకం: కేటీఆర్
మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఏడేళ్ల క్రితం ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం దేశానికే మార్గదర్శిగా నిలుస్తోందని చెప్పారు. దేశంలోనే తొలిసారిగా వైద్య సేవల్లో డ్రోన్లను వినియోగించే అతి ముఖ్యమైన ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం వరల్డ్ ఎకనామిక్ ఫోరం భాగస్వామ్యంతో చేపట్టిందని వివరించారు. ‘‘రెండేళ్ల క్రితం దావోస్‌లో జరిగిన సమావేశంలో ఫోరం సభ్యులు ఈ అంశంపై చర్చించారు. ప్రయత్నిస్తే దేశానికే మీరు ఆదర్శంగా నిలుస్తారని నాకు, ప్రభుత్వ కార్యదర్శి జయేశ్‌రంజన్‌కు చెప్పారు. అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. వైద్య సేవలతో పాటు మహిళలు, పిల్లల భద్రత, ప్రభుత్వ, ఖాళీ స్థలాల గుర్తింపు వంటి ఎన్నో లాభాలు ఈ టెక్నాలజీ ద్వారా పొందే వీలుంది. దిశ వంటి ఘటన ఎదురైతే చరవాణిలో ఒక మీట నొక్కితే సైరన్ మోగిస్తూ డ్రోన్ సంఘటనా స్థలానికి చేరుకుంటుంది. ఆ సైరన్ విని దుండగులు పారిపోతారు. వీటితో ఫొటోలు, వీడియోలు తీసి కేసును ఛేదించడమూ పోలీసులకు సులభమవుతుంది’’ అని కేటీఆర్ వివరించారు.
ఏవియేషన్ యూనివర్సిటీ ఏర్పాటు చేయండి..
బేగంపేట్ విమానాశ్రయంలో ఏవియేషన్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనిజ్యోతిరాదిత్య సింధియాను మంత్రి కేటీఆర్, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి కోరారు. కార్యక్రమంలో మంత్రి సబితాఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, వాణీదేవి, వికారాబాద్, పరిగి, చేవెళ్ల, తాండూరు, కొడంగల్ ఎమ్మెల్యేలు ఆనంద్, మహేష్‌రెడ్డి, యాదయ్య, రోహిత్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, జడ్పీ అధ్యక్షురాలు సునీతారెడ్డి, సివిల్ ఏవియేషన్ కార్యదర్శి కరోలా తదితరులు పాల్గొన్నారు.