తెలంగాణలో సినిమా థియేటర్ల విద్యుత్ బిల్లులపై ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాలని సినిమా థియేటర్ యజమానుల సంఘం ప్రభుత్వాన్ని కోరింది. కరోనా కారణంగా థియేటర్లు మూతపడి, తీవ్రంగా నష్టపోయామన్నారు. ఇప్పుడు థియేటర్లు తెరిచినా.. పూర్తిస్థాయిలో బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉందన్నారు. పార్కింగ్ ఫీజులు వసూలు చేసుకునేలా ప్రభుత్వం అనుమతివ్వాలని కోరారు.
అక్టోబర్ 15 నుంచి 50 శాతం సీట్ల సామర్థ్యంలో థియేటర్లు పునఃప్రారంభించుకోవచ్చని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సుదర్శన్ థియేటర్లో తెలంగాణ సినిమా థియేటర్ యజమానులు సమావేశమయ్యారు. సంఘం అధ్యక్షుడు విజయేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో 40 మంది థియేటర్ యజమానులు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అక్టోబర్ 15 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని సినిమా థియేటర్లను పునఃప్రారంభిస్తున్నట్లు ఏకగ్రీవంగా తెలిపారు.
విరామ సమయంపై..
సినిమా హాల్‌కు వచ్చే ప్రేక్షకులు కరోనా బారినపడకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భౌతిక దూరం పాటించేలా అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు వెల్లడించారు. ప్రేక్షకులు ఎవరూ టికెట్లు తాకకుండా, విరామ సమయంలో గూమిగూడకుండా ఉండేలా జాగ్రత్త వహిస్తామని పేర్కొన్నారు. అవసరమైతే విరామ సమయం లేకుండానే సినిమాను ప్రదర్శించేలా చూస్తామని, సమయాన్ని పొడిగిస్తామని స్పష్టం చేశారు.