తెలంగాణ

telangana

ETV Bharat / city

పాతబస్తీకి కొత్త నగిషీలు.. శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్​

KTR Old City Visit : మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని ఉక్కుపాదంతో అణిచివేస్తామని... అలాంటి వారిని ఓ కంట కనిపెడుతూనే ఉండాలని మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ వారసత్వాన్ని కాపాడుకుంటూనే... అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు వెల్లడించారు. పాతబస్తీలో ఇవాళ ఒక్కరోజే దాదాపు 500 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి... కొత్త నగరానికి దీటుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు.

KTR Old City Visit
KTR Old City Visit

By

Published : Apr 19, 2022, 12:03 PM IST

Updated : Apr 19, 2022, 7:39 PM IST

పాతబస్తీకి కొత్త నగిషీలు.. శ్రీకారం చుట్టిన మంత్రి కేటీఆర్​

KTR Old City Visit : హైదరాబాద్‌ పాతనగరానికి కొత్త నగిషీలు అద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం విస్తృత చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌... ఒకేరోజు 495 కోట్ల 75 లక్షల రూపాయలతో చేపట్టిన 6 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. హోంమంత్రి మహబూద్‌ అలీ, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ, ఎమ్మెల్యేలతో కలిసి పాతబస్తీలో కేటీఆర్​ విస్తృతంగా పర్యటించారు. మీరాలం చెరువులో 2కోట్ల 55లక్షలతో పూర్తిచేసిన మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌ను కేటీఆర్​ ప్రారంభించారు. ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్న ఈ మల్టీమీడియా మ్యూజికల్‌ ఫౌంటెయిన్‌తో పాటు చెరువులో తీగల వంతెన, చుట్టూ కాలిబాట, సైకిల్‌ ట్రాక్‌, పార్కుల అభివృద్ధికి ప్రణాళిక రూపొందించారు.

అనంతరం, పాతబస్తీ కాలాపత్తర్‌ పోలీస్‌ స్టేషన్‌ నూతన భవన నిర్మాణానికి హోంమంత్రి మహమూద్‌ అలీతో కలిసి కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న పాత భవనంలో ఇరుకుగా ఉండటంతో... తీవ్ర ఇబ్బందులు తలెత్తుతున్నాయి. దీంతో పోలీస్‌ హౌజింగ్‌ కార్పొరేషన్‌ ద్వారా కాజాపహాడీ వద్ద 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో... 4కోట్ల రూపాయల వ్యయంతో 3 అంతస్తుల్లో ఈ నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. హైదరాబాద్‌ను సిగ్నల్‌ రహిత నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా తీసుకువచ్చిన ఎస్​ఆర్​డీపీలో భాగంగా... 108 కోట్ల రూపాయలతో బహదూర్‌పురలో 690 మీటర్ల పొడవునా నిర్మించిన మల్టీలెవల్‌ ఫ్లై ఓవర్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. 13 ఫిల్లర్లు, ఇరువైపులా సర్వీస్‌ రోడ్లతో నిర్మించిన ఈ ఫ్లైఓవర్‌ అందుబాటులోకి రావడంతో... ట్రాఫిక్‌ ఇబ్బందులు చాలా వరకు తీరనున్నాయి.

పాతబస్తీలోని చారిత్రక కట్టడాల పునరుద్ధరణలో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులకు కేటీఆర్​ శంకుస్థాపన చేశారు. 90కోట్ల 45 లక్షల వ్యయంతో చేపట్టిన ఈ పనుల్లో... 36 కోట్ల రూపాయలతో చార్మినార్‌ వద్ద ముర్గీ చౌక్‌గా పిలువబడే మహబూబ్‌ చౌక్‌ను పునరుద్ధరించనున్నారు. అలాగే... 21కోట్ల 90లక్షల వ్యయంతో చార్మినార్‌ జోన్‌లో మీరాలం మండిని ఆధునికీకరణ, 30 కోట్ల రూపాయతో చేపట్టే సర్దార్‌ మహల్‌ అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. 400ఏళ్ల చరిత్రను కాపాడుతూనే... హైదరాబాద్‌ అభివృద్ధికి బాటలు వేస్తున్నట్లు కేటీఆర్​ తెలిపారు.

'ఏ ఎన్నికలు లేకపోయినా ఒకటే రోజు రూ.500 కోట్లతో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు పునాది వేశామంటే.. ఈ ప్రభుత్వ చిత్తశుద్ధి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఓ వైపు భాగ్యనగర వారసత్వ సంపదను కాపాడుకుంటూ.. మరోవైపు పాతబస్తీని కొత్త నగరానికి దీటుగా తీర్చిదిద్దుతున్నాం. పాతబస్తీలో మౌలిక సదుపాయాలు పెంచేందుకు కృషి చేస్తున్నాం. కులీ కుతుబ్​ షా కట్టడానికి పూర్వవైభవం తీసుకొచ్చేలా చర్యలు చేపడుతున్నాం.'- కేటీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి

ప్రజల మధ్య చిచ్చుపెట్టే వారిని కేసీఆర్​ సర్కార్‌ ఉక్కుపాదంతో అణిచివేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్​ హెచ్చరించారు. మతరాజకీయాలు చేసే వారిని సహించేది లేదన్న మంత్రి... అలాంటి వారిని ఓ కంట కనిపెడుతుండాలని సూచించారు. అనంతరం కార్వాన్ నియోజకవర్గంలోని సీవరేజ్ పనులకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పారిశుద్ధ్య కార్మికుల జీతాలను 8 వేల నుంచి 17 వేలకు పెంచామని మంత్రి తెలిపారు. పెట్రోల్‌, డీజిల్‌, సిలిండర్‌ ధర పెంపుతో పేదల జీవితం దుర్భరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. వీటితో పాటు కార్వాన్‌లో జలమండలి ద్వారా 297కోట్ల 30 లక్షల వ్యయంతో జోన్‌ - 3 లో సివరేజీ నెట్‌వర్క్‌ పనులను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు.

Last Updated : Apr 19, 2022, 7:39 PM IST

ABOUT THE AUTHOR

...view details