రాష్ట్రంలో భూ తగాదాలు లేకుండా చేయాలన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధరణి పోర్టల్‌ను (DHARANI PORTAL) తీసుకొచ్చింది. అధికారుల విచక్షణ అధికారాలకు కత్తెర వేసి.. బయోమెట్రిక్ విధానంలో పూర్తి పారదర్శకంగా భూ లావాదేవీలు జరిగేలా ప్రభుత్వం.. ధరణిని ఓ ట్రెండ్ సెట్టర్‌గా అభివర్ణించింది. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు.. పారదర్శకంగా, నిమిషాల వ్యవధిలోనే పూర్తవుతున్నాయి. అయితే ఈ క్రమంలో మానవ, సాంకేతిక తప్పిదాలు కొత్త సమస్యలను తీసుకొచ్చాయి. మెజార్టీ లావాదేవీలు సాఫీగా సాగేలా వివిధ రకాల మాడ్యూల్స్‌ను ధరణిలో అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే కొన్ని తప్పిదాలను సవరించే ఆస్కారం లేకపోవడం భూ యజమానులకు శాపంగా మారింది. దీంతో సదరు భూముల లావాదేవీలకు అవకాశం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
కొత్త మాడ్యూల్స్ తీసుకొస్తున్నా..
రాష్ట్రవ్యాప్తంగా లక్షకు పైగా సర్వే నంబర్లు నిషేధిత భూముల జాబితాలో ఉన్నాయి. ప్రజావసరాల కోసం సర్వే నంబర్లో కొంత భూమిని సేకరిస్తే.. కొన్నిచోట్ల ఆ నంబర్ మొత్తం నిషేధిత జాబితాలోకి వెళ్లింది. కొన్ని ప్రైవేటు స్థలాలు ప్రభుత్వ భూముల జాబితాలో చేరాయి. రెవెన్యూ, కార్డ్ డేటాలు కలపడంతో మిస్ మ్యాచ్ అయి ఇబ్బందికరంగా మారింది. పేర్ల నమోదులో జరిగిన తప్పిదాలు యజమానులకు సంకటంగా మారాయి. ఇబ్బందుల పరిష్కారం కోసం తీసుకొచ్చిన గ్రీవెన్స్ వ్యవస్థ తగిన పరిష్కారం చూపడం లేదు. ఈ సమస్యలన్నీ గత ఏడాది కాలంగా వెలుగు చూస్తునే ఉన్నాయి. ఎప్పటికప్పుడు కొత్త మాడ్యూల్స్ తీసుకొస్తున్నా... అన్ని సమస్యలకు పరిష్కారం చూపడం లేదు.
తాజా కేబినెట్లో ప్రస్తావన..
ఇటీవల దళితబంధు పథకంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (TELANGANA CM KCR REVIEW)నిర్వహించిన సన్నాహక సమావేశం సహా.. తాజా మంత్రివర్గ భేటీలోనూ ధరణి ధరణి పోర్టల్ (DHARANI PORTAL) సమస్యలు ప్రస్తావనకు వచ్చాయి. కొందరు మంత్రులు సైతం క్షేత్రస్థాయి ఇబ్బందులను వివరించారు. ఈ సమస్యల పరిష్కారం కోసం సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలతో సబ్ కమిటీ ఏర్పాటైంది. గతంలోనూ ఈ తరహా కమిటీ కొంత కసరత్తు చేసింది. తాజాగా మరోమారు ఉపసంఘం ద్వారా పరిష్కారాల కోసం ప్రయత్నిస్తున్నారు.