తెలంగాణ

telangana

ETV Bharat / city

IND vs ENG: నిరాశపర్చిన టీమ్‌ఇండియా బ్యాటింగ్‌

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో భారత్‌ తేలిపోయింది. 278 పరుగులకే టీమ్‌ఇండియా ఆలౌటవడంతో ఇంగ్లాండ్‌ ఘన విజయం సాధించింది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ ఐదు వికెట్లు తీయగా ఓవర్టన్‌ మూడు తీశాడు.

Team India lost
Team India lost

By

Published : Aug 28, 2021, 6:37 PM IST

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో టెస్టులో టీమ్‌ఇండియా ఓటమిపాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో 278 పరుగులకే ఆలౌటైంది. దాంతో ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌ 76 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ క్రమంలోనే సిరీస్‌ను 1-1తో సమం చేసింది. 212/2 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో శనివారం నాలుగో రోజు ఆట ప్రారంభించిన భారత్‌ తొలి సెషన్‌లోనే మిగతా ఎనిమిది వికెట్లు కోల్పోయింది. భారత బ్యాట్స్‌మెన్‌ ఏ దశలోనూ కనీస పోరాటం చేయలేదు. మ్యాచ్‌ ప్రారంభమైన పది నిమిషాల నుంచే వికెట్ల పతనం మొదలైంది. రాబిన్‌సన్‌ 5 వికెట్లతో రెచ్చిపోయి బ్యాట్స్‌మెన్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. దాంతో టీమ్‌ఇండియా బ్యాట్స్‌మెన్‌ ఎప్పటిలాగే ఆఫ్‌సైడ్‌ బంతులను తప్పుడు అంచనా వేస్తూ వికెట్ల వెనుక క్యాచ్‌లు సమర్పించుకున్నారు.

మ్యాచ్‌ ప్రారంభమైన పదినిమిషాల్లోనే పుజారా (91) రాబిన్‌సన్‌ బౌలింగ్‌లో వికెట్ల ముందు దొరికిపోయి శతకం చేజార్చుకున్నాడు. కాసేపటికే కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ(55) అర్ధశతకం సాధించినా రాబిన్‌సన్‌ బౌలింగ్‌లోనే స్లిప్‌లో రూట్‌ చేతికి చిక్కాడు. అప్పటికి భారత్‌ స్కోర్‌ 237/4గా నమోదై కష్టాల్లో పడింది. ఆపై వైస్‌ కెప్టెన్‌ రహానె(10), పంత్‌(1), షమి(6), ఇషాంత్‌(2), జడేజా(30), సిరాజ్‌(0) కనీస పోరాటం చేయకుండా వెనుదిరిగారు. బుమ్రా(1) నాటౌట్‌గా నిలిచాడు. చివరికి భారత్‌ 99.3 ఓవర్లలో 278 పరుగులకు ఆలౌటై ఓటమిపాలైంది. ఇంగ్లాండ్‌ బౌలర్లలో రాబిన్‌సన్‌ ఐదు వికెట్లు తీయగా ఓవర్టన్‌ మూడు తీశాడు. అలాగే అండర్సన్‌, మొయిన్‌ అలీ చెరో వికెట్‌ సాధించారు.

రోహిత్‌, పుజారా పోరాటం వృథా..

అంతకుముందు మూడో రోజు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ(59), పుజారా అర్ధశతకాలతో రాణించి జట్టును మెరుగైన స్థితిలో నిలిపారు. కఠిన పరిస్థితుల్లోనూ ఇంగ్లాండ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని పరుగులు రాబట్టారు. దాంతో భారత్‌ మూడో రోజు ఆట పూర్తయ్యేసరికి 212/2 స్కోర్‌తో నిలిచి మ్యాచ్‌లో పోరాటం చేసేలా కనిపించింది. ఈ క్రమంలోనే నాలుగో రోజు కూడా ఇలాగే ఆడితే మ్యాచ్‌ రసవత్తరంగా సాగుతుందని అంతా ఆశించారు. కానీ, భారత బ్యాట్స్‌మెన్‌ నాలుగో రోజు ఆడలేకపోయారు. ఇంగ్లాండ్‌ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి కోహ్లీసేనను కట్టడి చేశారు.

స్కోరుబోర్డు వివరాలు:

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 78 ఆలౌట్‌.. రోహిత్‌(19), అండర్సన్‌ 3 వికెట్లు

ఇంగ్లాండ్‌ తొలి ఇన్నింగ్స్‌: 432 ఆలౌట్‌.. జో రూట్‌(121), షమి 4 వికెట్లు

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 278 ఆలౌట్‌.. పుజారా (91), రాబిన్‌సన్‌ 5 వికెట్లు

ఇదీ చూడండి: స్పిన్ బౌలింగ్​లోనూ హెల్మెట్​తో.. ఈసీబీ రూల్ ఏం చెబుతోంది?

ABOUT THE AUTHOR

...view details