తెలంగాణ చిన్నమ్మగా పేరొందిన.. కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత సుష్మా స్వరాజ్ మృతిపట్ల ముఖ్యమంత్రి కేసీఆర్,కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్రెడ్డి, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, , రాష్ట్ర భాజపా అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా ఎంపీ బండి సంజయ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
'కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ మరణం దేశానికి తీరని లోటు. వివిధ హోదాల్లో దేశానికి ఎనలేని సేవ చేశారు. ఆమె కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి'.
- కేసీఆర్, ముఖ్యమంత్రి
‘'సుష్మాస్వరాజ్ నాకే కాదు యావత్ తెలంగాణకు చిన్నమ్మే. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి రాష్ట్రం వచ్చేలా చేసిన ఆమె కృషిని ఎన్నటికీ మరువలేము. ప్రజా సమస్యలపై ఆమె స్పందించే తీరు మాలాంటి వారికి స్ఫూర్తి. సుష్మాస్వరాజ్ ఆత్మకు శాంతి కలగాలని కోరుకొంటూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’'
- కిషన్రెడ్డి, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
'సుష్మా స్వరాజ్ మరణంతో... తమ ఆత్మీయురాలిని పోగొట్టుకున్నామన్న బాధ ప్రతి తెలంగాణ పౌరుడి మదిలో ఉంది. సామాన్య తెలంగాణ పౌరుడి మనోవేదనను ప్రత్యేక రాష్ట్ర సాధన దిశగా మలిచిన ధన్యురాలు సుష్మా స్వరాజ్. తమ ఇంటి ఆడపడుచు మరణం తీరని లోటు.'
- బండి సంజయ్, భాజపా ఎంపీ
'కేంద్ర మాజీ మంత్రి సుష్మ స్వరాజ్ మరణవార్త విని తీవ్రదిగ్భ్రాంతికి
లోనయ్యాను. తెలంగాణ రాష్ట్ర సాధికారత కోసం ఆమె చేసిన కృషి, ఇచ్చిన మద్దతు ఎప్పటికి రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంటుంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.'
- కేటీఆర్, తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు