Police Notice to MLA Raja Singh: ఎమ్మెల్యే రాజాసింగ్‌కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. మంగళ్‌హాట్, షాహినాయత్ గంజ్ పీఎస్‌లలో నమోదైన కేసులలో వేర్వేరుగా 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. ఈ ఏడాది ఫిభ్రవరి 19న మంగళ్‌హాట్ పీఎస్‌లో రాజాసింగ్‌పై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్ ఎన్నికల సందర్భంగా అనుచిత వ్యాఖ్యలు చేశారని... కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు మంగళ్‌హాట్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.
షాహినాయత్ గంజ్ పీఎస్‌లోనూ ఏప్రిల్ 12న మరో కేసు నమోదైంది. శ్రీరామనవమి శోభాయాత్ర సందర్భంగా బేగంబజార్ ఛత్రి ప్రాంతంలో రెచ్చగొట్టే విధంగా పాట పాడారని, ఎస్సై రాజేశ్వర రెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు షాహినాయత్ గంజ్ పీఎస్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఈ రెండు కేసులలోనూ పోలీసులు ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో రాజాసింగ్‌కు 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేయడంతో.. మరోసారి నన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు కుట్ర పన్నుతున్నారని రాజాసింగ్ ఆరోపించారు. ఆర్నెళ్ల క్రితం కేసులు నమోదైతే.. పోలీసులు ఇన్ని రోజులు ఏం చేశారని రాజాసింగ్ ప్రశ్నించారు.
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఎమ్మెల్యే రాజాసింగ్ విడుదల చేసిన వీడియోతో ఒక్కసారిగా దుమారం చెలరేగింది. సదరు వీడియో వైరల్ కావటంతో.. రాజాసింగ్‌పై హైదరాబాద్‌లోని పలు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. తమ మనోభావాలను దెబ్బతీసేలా రాజాసింగ్ వ్యాఖ్యానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఓ వర్గపు యువత.. ఆయన్ని వెంటనే అరెస్ట్ చేయాలంటూ ఆందోళనకు దిగారు. పలువురు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు మంగళవారం ఉదయం రాజాసింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో అటు రాజాసింగ్ ఇంటి పరిసరాలతో పాటు పాతబస్తీలో భారీగా బలగాలను మోహరించారు.
ఇదిలా ఉంటే.. హైదరాబాద్ పాతబస్తీలో కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. పోలీసులు పూర్తి స్థాయిలో ఓల్డ్ సిటీని తమ అధీనంలోకి తీసుకున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించారు. మీర్‌చౌక్, చార్మినార్, గోషామహల్ పరిధిలో మొత్తం 360 మంది ఆర్పీఎఫ్ బలగాలు విధుల్లో ఉన్నాయి. ప్రధాన ప్రాంతాలైన చాంద్రాయణగుట్ట, చార్మినార్, యాకుత్‌పురా, బహదూర్‌పురా, ఫలక్‌నుమా, శాలిబండతో పాటు మోగల్పురా, తలాబ్ కట్టా, రీన్‌బజార్ ప్రాంతాల్లో వ్యాపార సముదాయాలు రాత్రి 8 గంటల లోపే మూసివేయించారు. రోడ్లపై అకారణంగా తిరుగుతున్న వాహనదారులు, పాదచారులను ఇళ్లకు పంపించారు. వీధివీధి గస్తీ వాహనాలతో పెట్రోలింగ్ నిర్వహించారు. అదనపు సీపీ స్థాయి అధికారి బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు.