మబ్బు పట్టడంతో వర్షం(telangana rains news) వస్తుందని దుకాణానికి వెళ్లి టార్పాలిన్లు తీసుకొచ్చేలోపే మొత్తం పంట తడిసిపోయిందని ఓ రైతు ఆవేదన.. దిగుబడే తక్కువ వచ్చింది... అది కూడా కొట్టుకుపోయిందని ఓ అన్నదాత ఆక్రందన... ఇలా ఏ రైతును కదిపినా వర్షంతో మా పరిస్థితి ఆగమాగమైందని వాపోతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో సుమారు 207 ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఒకటి నుంచి రెండు సెం.మీ వర్షపాతం నమోదైంది.
ఈ వర్షాల(telangana rains news)కు విక్రయకేంద్రాల్లో, కల్లాల్లో ఉంచిన ధాన్యం(paddy crop) తడిసిపోయింది. దానిని కాపాడుకోవడానికి రైతులు నానా తంటాలుపడ్డారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని మధురానగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలో గత వారం పదిరోజుల్లోనే ధాన్యం తడవకుండా ఉపయోగించే టార్పాలిన్లు దాదాపు రెండువేలకు పైగా అమ్ముడుపోయినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వీటినే కాదు గోనె సంచులను కుట్టీ అద్దెకు ఇస్తున్నారు.ఒక్కొక్క దానికి రోజుకు రూ.15 కిరాయి వసూలు చేస్తున్నారు. ఇంత గోస ఎప్పుడూ పడలేదని కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకు చెందిన బొందయ్య పేర్కొన్నారు.
‘‘ఏడు ఎకరాల్లో వరిసాగు చేస్తే దిగుబడి బాగా తగ్గి తొమ్మిది ట్రాక్టర్లే వచ్చింది. ధాన్యం ఆరబెట్టి ఎండాక ఇప్పుడు మళ్లీ తడిశాయి. ఇప్పుడు ఒక్కొక్కటి రూ.1600 పెట్టి నాలుగు టార్పాలిన్లు కొన్నా. ఆరబెట్టడం, కుప్పపోయడంతోనే సరిపోతోంది. నా టోకెన్ నంబరు 107, ముందు చాలా మంది ఉన్నారు. ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. పంట పండించడం కంటేఅమ్ముకోవడానికే ఎక్కువ ఇబ్బంది పడాల్సి వస్తోంది’’ అని తెలిపారు. గోనెసంచులతో కుట్టిన వాటి అద్దెకూ రోజుకు రూ.225 చెల్లించాల్సి వస్తోందన్నారు. ప్రస్తుతం అనేక మంది రైతులది ఇదే పరిస్థితి.
కప్పేలోగా కుప్ప తడిసింది
వర్షం(telangana rains news) వస్తుందని కప్పడానికి టార్పాలిన్ షీట్లు కొనుక్కొచ్చేలోగా నష్టం జరిగిపోయింది. నాలుగు ఎకరాల్లో వరి సాగు చేస్తే 70 క్వింటాళ్లు వచ్చింది. ధాన్యం సొసైటీ కేంద్రానికి తెచ్చి 15 రోజులు అయ్యింది. తేమ 20 శాతం ఉంది. రోజూ ఆరబెట్టడం, కుప్పపోయడం చేస్తున్నాం. సొసైటీ దగ్గర భూమి చదునుగా లేదు. దీంతో వర్షం వచ్చి వడ్లు కొట్టుకుపోయాయి. పక్కనే ఉన్న మార్కెట్ కేంద్రంలో టార్పాలిన్లు ఉన్నా సొసైటీ వాళ్లు తేలేదు. రూ.ఆరువేలు అప్పు తెచ్చి రెండు టార్పాలిన్లు కొనుక్కొచ్చా. నేనే కాదు, 30 మందికి పైగా రైతులు ఇలా కొనుక్కొచ్చారు. కొనుగోలు కేంద్రాలను పొలాల్లో పెట్టడం కూడా సమస్యగా మారింది.