ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మత్స్యకారులకు అండగా ఉంటామన్న మాట నిలబెట్టుకున్నామని సీఎం జగన్ మోహన్‌రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ఆయన ఆన్‌లైన్ విధానంలో వైఎస్సార్ మత్స్యకార భరోసా పథకం నిధులను విడుదల చేశారు. కరోనా సంక్షోభంలోనూ మత్య్యకార భరోసా కొనసాగిస్తున్నామని జగన్ అన్నారు. అధికారంలోకి రాగానే 2019లో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు గుర్తు చేశారు.
కొవిడ్ సమయంలో ప్రభుత్వానికి ఆర్థిక కష్టాలున్నా.. పేద ప్రజలు ఇబ్బందులు పడకూడదని సీఎం స్పష్టం చేశారు. వరుసగా మూడో ఏడాది ఈ నిధులు ఇస్తున్నట్లు చెప్పారు. వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోతే రూ.10 లక్షల పరిహారం ఇస్తున్నామన్నారు. 1,19,875 మంది మత్స్యకార కుటుంబాలను ఈ పథకం ద్వారా ఆదుకుంటున్నామని తెలిపారు. ఏ సంక్షేమ పథకంలోనైనా అవినీతికి, వివక్షకు తావు లేదని జగన్ వివరించారు.