ఈసారి జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తున్న ఐఐటీ దిల్లీ... తాజా సమాచార కరపత్రాన్ని (బ్రోచర్‌ను) విడుదల చేసింది. గతంలో ఏపీలో 16, తెలంగాణలో 7 నగరాలు/పట్టణాల్లో పరీక్షా కేంద్రాలను ప్రకటించగా తాజాగా తెలంగాణలో 15, ఏపీలో 30 చోట్ల నిర్వహించాలని నిర్ణయించారు. తెలంగాణలో ఆదిలాబాద్, పాల్వంచ, సత్తుపల్లిలలో సైతం పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 731 ప్రాంతాల్లో పరీక్ష నిర్వహిస్తారు.
అక్టోబరు 8న ఏఏటీ
ఐఐటీల్లో ఆర్కిటెక్చర్ కోర్సుల్లో చేరాలనుకునే విద్యార్థులు అక్టోబరు 5 నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్ అర్హత సాధించిన వారే దీనికి అర్హులు. వారికి అదే నెల 8న ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్టు (ఏఏటీ) పరీక్ష నిర్వహిస్తారు. దేశంలోని 23 ఐఐటీల్లో ఈ పరీక్ష జరుగుతుంది. 11వ తేదీన ఫలితాలు వెల్లడిస్తారు.
తెలంగాణలో పరీక్ష కేంద్రాలు
ఆదిలాబాద్, హైదరాబాద్, జనగామ, కరీంనగర్, ఖమ్మం, కోదాడ, మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, పాల్వంచ, సత్తుపల్లి, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్
జేఈఈ మెయిన్ ‘దూర’భారమే
సెప్టెంబరు 1 నుంచి జరగాల్సిన జేఈఈ మెయిన్‌కు తెలంగాణలో కేవలం ఆరు చోట్లే పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, నల్గొండ నగరాల్లో మాత్రమే పరీక్ష జరగనుంది. అంటే ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన వారు హైదరాబాద్ లేదా కరీంనగర్‌కు వెళ్లక తప్పదు.
మెయిన్ ఫలితాలు 11న!
సెప్టెంబరు 1 నుంచి 6 వరకు జరిగే జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన 2.50 లక్షల మందిని జేఈఈ అడ్వాన్స్‌డ్ రాసేందుకు అనుమతిస్తారు. అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తు ప్రక్రియ సెప్టెంబరు 12న మొదలవుతుంది. మెయిన్ ఫలితాలను 11న వెల్లడించే అవకాశం ఉంది. అందులో అర్హత సాధించిన వారు ఐఐటీల్లో చేరాలనుకుంటే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది.
అడ్వాన్స్‌డ్ పరీక్ష షెడ్యూలు
- సెప్టెంబరు 12-17 వరకు: రిజిస్ట్రేషన్‌కు గడువు
- సెప్టెంబరు 18: ఫీజు చెల్లింపు గడువు
- సెప్టెంబరు 21 నుంచి: హాల్‌టికెట్లు డౌన్‌లోడ్
- సెప్టెంబరు 27: పరీక్ష
- సెప్టెంబరు 29-30: విద్యార్థుల ఓఎంఆర్ పత్రాలు వెబ్‌సైట్లో, తాత్కాలిక కీ విడుదల, అభ్యంతరాల స్వీకరణ
- అక్టోబరు 5: ఉదయం 10 గంటలకు ర్యాంకుల వెల్లడి