తెలంగాణ

telangana

ETV Bharat / city

ఇహానికి... పరానికి రంగుల పున్నమి!

భారతీయ సంప్రదాయంలో హోలీ పండగ చాలా ప్రాచీనమైనది. వసంత రుతువుకు స్వాగతం చెబుతూ ఉత్సాహంగా జరుపుకొనే రంగుల పర్వదినమిది. ఈ వేడుకకు ఎన్నో పేర్లు, మరెన్నో పరమార్థాలు ఉన్నాయి. రంగుల పండగ ప్రాముఖ్యతను మనమూ తెలుసుకుందాం.. రండి...

holi festival importance in telugu
holi festival importance in telugu

By

Published : Mar 28, 2021, 6:29 AM IST

హోలీ పర్వదినానికి, కాలంలో వచ్చే మార్పులకూ సంబంధం ఉంది. ఈ పండగ నాటికి చైత్రమాస ఆగమనం పదిహేను రోజుల దూరంలో ఉంటుంది. కాబట్టి ప్రకృతిలో వసంత రుతువు లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. ఈ సమయంలో జరిపే ఉత్సవం వల్ల మానసిక, శారీరక ఆరోగ్యం చక్కబడి జీవితాల్లో కొత్త ఉత్సాహం తొణికిసలాడుతుంది. చిగురించే ఆకులు, వికసిస్తున్న పువ్వులు, పంటలలో ఇమిడి ఉన్న ఔషధ గుణాలు దీనికి కారణం. వాటిని ఒడిసి పట్టుకోడానికి చేసే ప్రయత్నాల వల్ల ఎటుచూసినా రంగులు, ఉత్సాహభరితమైన వాతావరణం నెలకొని ఉంటుంది. ఈ కాలంలో దొరికే పూలు, చిగుళ్లు, వేర్లతో తయారుచేసిన రసాయన ద్రవాన్ని వసంతం అంటారు. దీన్ని ఒకరిపై ఒకరు చల్లుకోవడం ఈ ఉత్సవంలో ప్రధాన ఆకర్షణ. ఇది ఆరోగ్యకారకం.

  • బృందావన గోపికలతో శ్రీకృష్ణుడి రాసలీలలకూ, హోలీ పండుగకూ సంబంధం ఉందంటారు. పున్నమినాటి సాయంత్రం శ్రీకృష్ణుడిని ఉయ్యాలలో వేసి ఊపుతారు. దీన్ని డోలోత్సవం అంటారు. ఈ రోజున దర్శించే భక్తులకు వైకుంఠప్రాప్తి కలుగుతుందని ధర్మశాస్తాల్రు తెలియ జేస్తున్నాయి. అందుకే ఈ రోజును ఉత్తరాదిలో డోలాపూర్ణిమ అని అంటారు.
  • మధుర మీనాక్షీ దేవి తపస్సు చేసి సుందరేశ్వర స్వామిని వివాహం చేసుకున్నది ఫాల్గుణ శుద్ధ పూర్ణిమ నాడే. కాబట్టి ఆ రోజు మధుర, కంచిల్లోని దేవాలయాల్లో ఫాల్గుణ పూర్ణిమా ఉత్సవం జరుపుతారు. దీన్నే కల్యాణవ్రతం అంటారు.
  • హోలీ రోజున ‘లింగపురాణం’ దానం చేస్తే, శివలోక ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్న మాట. ఈ పూర్ణిమ లక్ష్మీ దేవికి ఎంతో ప్రీతికరమైనదని, అందువల్ల ఈ రోజున మహాలక్ష్మిని షోడశోపచారాలతో ఆరాధించి, లక్ష్మీ అష్టోత్తర శతనామాలు, కనకధారా స్తోత్రాలను పారాయణం చేయడం మంచిదని పురాణాలు చెబుతున్నాయి.

సృష్టిలో ఒక్కో రంగుది ఒక్కో ప్రత్యేకత. ఒక్కో ఆకర్షణ. వర్ణాలు మనుషుల భావోద్రేకాలు, ఆలోచనలపై విశేష ప్రభావం చూపుతాయని మనో విశ్లేషకులు చెబుతారు.
తెలుపు - స్పష్టత, స్వచ్ఛతలకు ప్రతీక. సున్నితత్వాన్ని, ప్రశాంతతను ఇస్తుంది.
నీలం - దివ్యత్వానికి ప్రతీక. మానసిక ఒత్తిడిని తగ్గించి ఏకాగ్రతని, చురుకుదనాన్ని కలిగిస్తుంది.
ఎరుపు - ఆకర్షించే గుణం ఎక్కువ. ఉత్సాహానికి, ఉద్వేగానికి ప్రతిక.
ఆకుపచ్చ - జీవ చైతన్యాన్ని పెంపొందింజేస్తుంది
నలుపు - ఆత్మవిశ్వాసం కలిగిస్తుంది. చెడుశక్తులను తనలో నిక్షిప్తం చేసుకుంటుంది.

ఇదీ చూడండి: మహావిష్ణువు కొలువుండే ఐదు ప్రదేశాలేంటో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details