కేటీఆర్ ముఖ్యమంత్రి పదవికి అన్ని విధాలా సమర్థుడని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. పట్టుదల, పాలనా దక్షత, వివిధ భాషలపై పట్టు కేటీఆర్‌కు ఉన్నాయన్నారు. అయితే కేటీఆర్ సీఎం అవుతారో లేదో దానిపై పార్టీలో ఏం చర్చ జరుగుతుందో తనకు తెలియదన్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో పోటీ చేయమని తనను ఎవరూ అడగలేదని.. అడిగినప్పుడు ఆలోచిస్తానని గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. ఏకగ్రీవం అయితే బాగుంటుందని.. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చాలా కాలంగా ఆ పద్ధతి కొనసాగుతోందని తెలిపారు. ప్రస్తుతం శాసనమండలి ఛైర్మన్గా సంతృప్తిగా ఉన్నానని.. పంచాయతీ స్థాయి నుంచి రాజకీయాల్లో ఎదిగిన తాను ఏ అవకాశాన్నయినా సద్వినియోగం చేసుకుంటానని స్పష్టం చేశారు.