KTR Tweet Today: బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. సంబంధిత వైస్ ఛాన్స్‌లర్‌తో ఇవాళ సమావేశం కానున్నట్లు పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో మౌలిక వసతులపై 8 వేల మంది విద్యార్థులు రోడ్డెక్కారంటూ... తేజగౌడ్ అనే వ్యక్తి ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్... సమస్యను ముఖ్యమంత్రి కేసీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. విద్యా నాణ్యత పెంపొందించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేటీఆర్ ట్వీట్‌కు సమాధానం ఇచ్చిన సబితా... వీలైనంత త్వరగా సమస్యలు పరిష్కరిస్తామని వెల్లడించారు.
అసలేం జరిగిందంటే..
నిర్మల్ జిల్లా బాసర ఆర్జీయూకేటీ విద్యాలయంలో నెలకొన్న సమస్యలు, సౌకర్యాల కొరత, సామగ్రి సరఫరాలో యాజమాన్య నిర్లక్ష్యంపై విద్యార్థులు గళమెత్తారు. సుమారు ఆరు వేల మంది విద్యార్థులు మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పరిపాలన భవనం ఎదుట బైఠాయించారు. రెండురోజుల కిందట విద్యాలయ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందించకపోవడంతో ఆందోళనకు దిగామన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి విద్యాలయానికి శాశ్వత ఉపకులపతి నియామకం జరపకపోవడం, మూడేళ్లుగా ల్యాప్‌టాప్‌ల సరఫరా, ఏకరూప దుస్తుల పంపిణీ లేకపోవడం, నాణ్యమైన భోజనం పెట్టకపోవడంపై ధర్నా చేపట్టినట్లు విద్యార్థులు తెలిపారు.
సమస్యల పరిష్కారానికి ప్రజాప్రతినిధులు, అధికారులకు విన్నవించినా స్పందన లేదన్నారు. సీఎం కేసీఆర్ తమ విద్యాలయానికి రావాలని డిమాండ్ చేశారు. సమస్యలపై స్పందించే వరకు ఆందోళన విరమించేది లేదన్నారు. విద్యార్థుల ఆందోళనకు బీఎస్పీ, భాజపా, కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలిపారు. విద్యార్థుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తూ విద్యాలయ ప్రధాన ద్వారం వద్ద దఫదఫాలుగా ఆందోళన నిర్వహించారు. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించేందుకు బాసరకు చేరుకోగా.. పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం విద్యాలయ ప్రహరీ దూకి లోపలికి వెళ్లగా గుర్తించిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ముథోల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఇవీ చదవండి: