పుట్టగానే అనాథలుగా మారి సంరక్షణ కేంద్రంలో ఉన్న పసికందులు, వివిధ కారణాల వల్ల తల్లికి దూరంగా ఉంచే బిడ్డల ఆకలి తీర్చుతోంది ‘ధాత్రి’ మిల్క్ బ్యాంక్. తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజూ 10 మంది వరకూ బాలింతలు చిన్నారుల ఆకలి తీర్చేందుకు ముందుకు వస్తున్నారని నిలోఫర్‌లోని ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ వ్యవస్థాపకుడు, డైరెక్టర్ డాక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో మూడు నెలల పాటు పాల సేకరణ వీలు పడకపోయినా.. అంతకుముందే సేకరించి నిల్వచేసిన తల్లిపాలు వందలాది మంది నవజాత శిశువుల ఆకలి తీర్చాయని సంతోష్ వివరించారు. ప్రస్తుతం నిలోఫర్‌లో పుట్టిన శిశువులకు మాత్రమే ఈ సేవలు అందిస్తున్నారు. ఇక్కడ తల్లిపాలను ఏడాదిపాటు నిల్వ చేసేందుకు అవసరమైన ఫ్రీజర్లను ఏర్పాటు చేశారు. ముందుముందు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రి, నిజామాబాద్, కాకినాడ తదితర ప్రాంతాల్లోని ఆసుపత్రులకూ తమ సేవలను విస్తరించడానికి సిద్ధమవుతున్నట్టు వివరించారు.
గోల్డెన్ అవర్..
పుట్టిన బిడ్డకు గంట వ్యవధిలో తల్లి పాలివ్వాలి. దీన్నే గోల్డెన్ అవర్ అంటారు. తల్లులకు పాలు రాకపోవటం, శిశువుల అనారోగ్యం, సిజేరియన్ తదితర కారణాలతో ఒక్కోసారి తల్లి, బిడ్డలను వేర్వేరుచోట్ల ఉంచాల్సి వస్తుంది. ఇటువంటి సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలతో శిశువుల ఆకలి తీర్చాలి. కాని పేగు సంబంధ సమస్యతో పుట్టిన పిల్లల్లో 10 శాతంమంది బయటిపాలు పట్టడం వల్ల ఇన్‌ఫెక్షన్లకు గురవుతారని పరిశోధనలు చెబుతున్నాయి. అందుకే తల్లిపాలతో వారి కడుపు నింపడమే మేలని డాక్టర్ సంతోష్‌కుమార్ తెలిపారు. 2017 నుంచి ఇప్పటి వరకూ సుమారు 8,400 మంది తల్లులు 3000 లీటర్లకు పైగా పాలను పంచి దాతృత్వం చాటుకున్నారని చెప్పారు.