హైదరాబాద్ నిరుద్యోగులకు ఉపాధికల్పన శాఖ శుభవార్త చెప్పింది. కరోనా కాలంలో ఉద్యోగం కల్పించేందుకు ఆన్‌లైన్ మేళా నిర్వహించనుంది. జూన్ రెండో వారంలో దీనికి సంబంధించి అధికారిక ప్రకటన విడుదల చేసేందుకు ఆ శాఖ సన్నాహాలు చేస్తోంది. హైదరాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద దీనిని నిర్వహించి అది విజయవంతమైతే అన్ని జిల్లాలకు విస్తరించాలనే ఆలోచనలో ఉన్నారు.
భయాన్ని తొలగించి.. భరోసా కల్పించి
కరోనా ప్రభావంతో కొత్త ఉద్యోగాలు ఉండవేమోనన్న భయాన్ని నిరుద్యోగుల్లో తొలగించనున్నారు. వారికి భరోసా కల్పించేందుకు ఇప్పటికే పలు ప్రైవేటు కంపెనీలతో చర్చించి ఉపాధి కల్పన దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. నగరంలోని సుమారు 3వేల ప్రైవేటు కంపెనీలు జిల్లా ఉపాధి కల్పనశాఖతో కలిసి పనిచేస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టే కంపెనీల అభ్యర్థనల ఆధారంగా నిరుద్యోగులకు అవకాశాలు కల్పించనున్నారు. ఆసక్తి ఉన్నవారు జిల్లా ఉపాధి కల్పన వెబ్‌సైట్‌ను సందర్శించాలన్నారు.
అధికారిక వెబ్‌సైట్‌లో నగరంలోని ఉద్యోగ అవకాశాలపై ఇప్పటికే నోటిఫికేషన్లు ఇస్తున్నామని అధికారులు తెలిపారు. అందులో సంపూర్ణ సమాచారం పొందుపరిచామన్నారు. ఆన్‌లైన్ జాబ్‌మేళా ద్వారా ఉపాధి పొందాలనుకునేవారు www.employment.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
కంపెనీల అభ్యర్థనల మేరకు సందేశాలు
కొన్ని కంపెనీలు ఉద్యోగాలు కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. అర్హత ఉన్న నిరుద్యోగ అభ్యర్థులకు సమాచారం ఇస్తాం. సంస్థల ప్రతినిధులు ప్రాథమిక ముఖాముఖిని ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. ఎంపికైనవారు కంపెనీలో నేరుగా జరిగే ముఖాముఖికి హాజరవుతారు.
- మైత్రి, జిల్లా ఉపాధి కల్పన అధికారి