తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనా ఉద్ధృతి: రోగులు నేలపై.. ప్రాణాలు గాల్లో..

వైరస్‌ విజృంభణతో ఆంధ్రప్రదేశ్​లోని పరీక్షా కేంద్రాలు, ఆస్పత్రులు బాధితులతో నిండిపోతున్నాయి. పరీక్షా కేంద్రాలు సరిపోక, ఫలితాలు తొందరగా రాని పరిస్థితులు ప్రైవేటు ల్యాబ్‌లకు వరంగా మారాయి. అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్యశాలల్లో సరైన సేవలు అందడం లేదని రోగులు వాపోతున్నారు. ప్రజలు మాత్రం ఇప్పటికీ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్న దృశ్యాలు అంతటా కనిపిస్తున్నాయి.

corona update news, ap corona news update
కరోనా ఉద్ధృతి: రోగులు నేలపై.. ప్రాణాలు గాల్లో..

By

Published : Apr 19, 2021, 8:46 AM IST

కరోనా ఉద్ధృతి: రోగులు నేలపై.. ప్రాణాలు గాల్లో..

ఆంధ్రప్రదేశ్​లో కొత్తగా 6 వేల 582 మందికి కరోనా నిర్ధారణ అయింది. 22 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎప్పటిలాగే చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 11 వందల 71 కేసులు నమోదయ్యాయి. శ్రీకాకుళం, కర్నూలు, గుంటూరు జిల్లాల్లోనూ తీవ్రత అధికంగా ఉంది. ప్రస్తుతం 44వేల 686 యాక్టివ్ కేసులు ఉండగా... 2వేల 343 మంది కోలుకున్నారు. కరోనా ఉద్ధృతి హడలెత్తిస్తుండగా... ఆస్పత్రుల్లో సరైన సేవలు అందక రోగులు యాతన పడుతున్నారు.

ఏపీలోని గుంటూరు జిల్లాలో 5 వేలకు పైగా పడకలు సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతుండగా... పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. స్ట్రెచర్లు, పడకలు సరిపోక నేలపైనే రోగులు పడి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. పడకలు ఖాళీ లేక చాలామంది వెనక్కి వెళ్తుండగా... ఆస్పత్రిలో రోజుల తరబడి ఉన్నా తగిన వైద్యం అందడం లేదని మరికొందరు వాపోతున్నారు. రోగులు, వైద్య సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, గ్లోవ్స్, సర్జికల్ మాస్కులూ తగినన్ని లేక ఆందోళనకర పరిస్థితులున్నాయి.

ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులన్నీ కరోనా బాధితులతో నిండిపోయిన వేళ...ఏపీలోని విజయవాడలో కొవిడ్ లక్షణాలున్న చాలామంది ఇళ్లలోనే ఉండిపోతున్నారు. కొత్త ప్రభుత్వ ఆసుపత్రికి నిత్యం వంద మంది వరకు బాధితులు వస్తున్నారు. వైరస్‌ తీవ్రత ఆధారంగా ఔషధాలు, చికిత్స అందిస్తున్నారు.

ఇంటి దగ్గరే ఉంటూ చికిత్స తీసుకునేవారికి ఉచితంగా మందులు అందజేసేందుకు జాతీయ రహదారి పక్కనే ఉన్న ఎన్‌.టి.ఆర్‌ దంత వైద్య ఆస్పత్రి ప్రాంగణంలో కేంద్రం ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బి.పి, ఆక్సిజన్‌, టెంపరేచర్‌ పరీక్షలూ నిర్వహిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనూ బహిరంగ ప్రదేశాల్లో ప్రజల్లో అప్రమత్తత లోపించిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలోని కృష్ణా జిల్లా ఉంగుటూరు ప్రాథమిక పాఠశాలలో ఓ ఉపాధ్యాయినికి కొవిడ్ సోకగా... స్కూలుకి 5 రోజులు సెలవు ప్రకటించారు. వైరస్‌ ఉద్ధృతి తీవ్రంగా ఉన్నా చిత్తూరు జిల్లా చంద్రగిరి కూరగాయల మార్కెట్‌లో ప్రజలు భౌతిక దూరం, మాస్కు లాంటివి పాటించకుండా ఎగబడుతుండటం ఆందోళనకరంగా మారింది. వారాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు విధించడం మేలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఏపీలోని అనంతపురం జిల్లా చిలమత్తూరు మండలం కొడికొండ చెక్‌పోస్ట్ వద్ద కర్ణాటక వైపు నుంచి వచ్చే వాహనదారులకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి వాహనాన్నీ ఆపి మాస్కు పెట్టుకోవాలని, శానిటైజర్ వాడాలని సూచిస్తున్నారు.

ఇదీ చదవండీ :వారానికి 15 లక్షల డోసులు.. ఇలాగైతేనే నిరంతర టీకా పంపిణీ

ABOUT THE AUTHOR

...view details