తెలంగాణ

telangana

ETV Bharat / city

central team visited Nellore : నెల్లూరులో కేంద్ర బృందం పర్యటన.. రూ. 1,190 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా

central team visit in AP : వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందకు కేంద్ర బృందం ఏపీకి వెళ్లింది. ఆదివారం రోజు నెల్లూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది. ఈ సందర్భంగా.. జిల్లాలో వరదల కారణంగా రూ. 1,190 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర అధికారులకు కలెక్టర్‌ చక్రధర్‌బాబు నివేదించారు.

central team visit ap
central team visit ap

By

Published : Nov 29, 2021, 9:53 AM IST

ఏపీలో కురిసిన భారీ వర్షాల కారణంగా జరిగిన నష్టాన్ని పరిశీలించేందకు కేంద్ర బృందం నెల్లూరు జిల్లాలో(central team tour in nellore district) పర్యటించింది. పెన్నా, కాళంగి, స్వర్ణముఖి నదీ పరీవాహక ప్రాంతాల్లోని 23 మండలాల్లో తీవ్ర ఆస్తి నష్టం జరిగిందని కేంద్ర బృందం సభ్యులకు జిల్లా అధికారులు వివరించారు. జిల్లాలో వరదల కారణంగా రూ.1,190 కోట్ల నష్టం వాటిల్లిందని కేంద్ర అధికారులకు కలెక్టర్‌ కేవీఎన్‌ చక్రధర్‌బాబు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. కడప, చిత్తూరు జిల్లాల మీదుగా వచ్చిన రెండు కేంద్ర బృందాలు ఆదివారం రోజు వేర్వేరు ప్రాంతాల్లో పర్యటించాయి.

హోంశాఖ వ్యవహారాల మంత్రిత్వశాఖ సలహాదారు కునాల్‌ సత్యార్థి నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఆత్మకూరు, కోవూరు మండలాల్లో(central team visit in ap) పర్యటించగా.. కలెక్టర్‌ వారికి అవసరమైన సమాచారం అందించారు. సోమశిల జలాశయం, దెబ్బతిన్న ఆఫ్రాన్‌, సోమశిల గ్రామాన్ని పరిశీలించారు. అనంతరం సంగం మండలం బీరాపేరువాగు వద్ద దెబ్బతిన్న రోడ్డు, పంట పొలాలను, విద్యుత్తు సరఫరా లైన్లను పరిశీలించారు. అక్కడ జరిగిన నష్టాన్ని జలవనరులు, వ్యవసాయశాఖ అధికారులు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. జొన్నవాడ నుంచి దేవరపాళేనికి వెళ్లే మార్గంలో ధ్వంసమైన ఆర్‌అండ్‌బీ రోడ్డును చూపించారు.

అనిల్‌కుమార్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని మరో బృందం.. నాయుడుపేట, ఇందుకూరుపేట మండలాల్లో(central team visit flood effected areas)తిరిగింది. ఇందుకూరుపేట మండలం జేజేపేటలోని అరటి తోటలు, గంగపట్నంలో దెబ్బతిన్న ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రోడ్లను, ముదివర్తిపాళెం, గంగపట్నం గ్రామాల్లో ఇసుకమేటలు వేసిన వరి పొలాలు, కోతకు గురైన చెరువును పరిశీలించారు. ముదివర్తిపాళెం సమీపంలోని రాజుకాలనీని సందర్శించగా- చెరువు కట్ట తెగిపోవడంతో వరద ప్రవాహం తమ కాలనీని ముంచెత్తిందని, సర్వం కోల్పోయామని బాధితులు కేంద్ర బృందం సభ్యులకు వివరించారు. వెంకటేశ్వరపురం సమీపంలో దెబ్బతిన్న ఎన్‌హెచ్‌-16ను చూపించి.. అప్పటి పరిస్థితిని జేసీ హరేంధిర ప్రసాద్‌ బృంద సభ్యులకు వివరించారు. నెల్లూరులోని ఓ హోటల్‌లో నష్ట తీవ్రతపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శనను తిలకించారు. తెదేపా, భాజపా నాయకులు కేంద్ర బృందాన్ని కలిసి వరద బాధితులను ఆదుకోవాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details