తెలంగాణ

telangana

ETV Bharat / city

'ఉపాధి హామీ కింద కేంద్రం 16 కోట్ల పనిదినాలు కల్పించాలి'

రాష్ట్రానికి ఉపాధి హామీ కింద కేంద్రం కనీసం 16 కోట్ల పనిదినాలు కల్పించాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పించాలని సూచించారు. రాష్ట్రంపై కేంద్రం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని, ఉపాధి హామీ నిధుల్లో కోత విధించరాదని డిమాండ్‌ చేశారు.

Employment Guarantee Scheme
Employment Guarantee Scheme

By

Published : May 24, 2022, 10:13 AM IST

ఉపాధి హామీ పథకం, పంచాయతీలకు నిధుల విడుదలతో కేంద్రప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. రాష్ట్రానికి ఉపాధి హామీ కింద కేంద్రం కనీసం 16 కోట్ల పనిదినాలు కల్పించాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని, పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ కల్పించాలని సూచించారు. సోమవారమిక్కడ మంత్రి దయాకర్‌రావు ఆధ్వర్యంలో ఉపాధి హామీ మండలి సమావేశం జరిగింది. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మల్లారెడ్డి, ఉన్నతాధికారులు సందీప్‌కుమార్‌ సుల్తానియా, క్రిస్టీనా, శరత్‌, ప్రసాద్‌ పాల్గొన్నారు. గతంలో మాదిరి ఎస్సీ, ఎస్టీలకు ప్రత్యేకంగా చెల్లింపులు చేయాలని, ఉపాధి హామీని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మండలి తీర్మానించింది. పనిజరిగే ప్రాంతాల్లో ఫొటోలు తీయడం, పంపించడం లాంటి నిబంధనల్ని వెనక్కు తీసుకోవాలని, ఉపాధి బకాయిలు రూ.97.35 కోట్లు విడుదల చేయాలని కోరింది. రాష్ట్రంలో పని అడిగిన కూలీలకు కొత్త జాబ్‌కార్డులు మంజూరు చేస్తున్నామని దయాకర్‌రావు తెలిపారు. గత ఏడాదికి 15 కోట్ల పనిదినాలు కల్పించి, రూ.4395 కోట్లు ఖర్చు చేశామన్నారు. కానీ ఈ ఏడాది కేంద్రం ఉపాధి హామీ పథకానికి రూ.25 వేల కోట్ల బడ్జెట్‌ కోత విధించిందని విమర్శించారు. లేబర్‌ బిల్లుల్ని రాష్ట్రానికి సంబంధం లేకుండా నేరుగా కూలీల ఖాతాల్లో జమ చేయడం అన్యాయమన్నారు.

సంజయ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు..రాష్ట్రప్రభుత్వం ఉపాధి హామీ నిధులు విడుదల చేయడం లేదంటూ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి ఎర్రబెల్లి విమర్శించారు. గ్రామాలకు ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధుల్ని కేంద్రం రూ.1830 కోట్ల నుంచి రూ.1380 కోట్లకు తగ్గించిందని విమర్శించారు. గ్రామాలకు అందాల్సిన నిధులు ఆలస్యం అవుతున్నాయన్నారు.

కొత్త పంచాయతీలకు పక్కా భవనాలు..రాష్ట్రంలోని కొత్త గ్రామ పంచాయతీలకు పక్కా భవనాలు నిర్మిస్తామని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. రోడ్లు, భవనాలు, పక్కా డ్రైనేజీ వ్యవస్థ కోసం సీఎం నిధులిచ్చారని పేర్కొన్నారు. సోమవారం గిరిజన గ్రామాల మౌలిక సదుపాయాలపై మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్‌, మల్లారెడ్డితో కలసి సమీక్ష నిర్వహించారు. ఎస్సీ, ఎస్టీ పంచాయతీలకు సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ప్రత్యేక నిధులకు ప్రాధాన్యమిస్తామని పేర్కొన్నారు. నిధుల విడుదలపై త్వరలో ఆర్థికశాఖ మంత్రితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కొత్త పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కోసం సీఎం బడ్జెట్లో రూ.వెయ్యి కోట్లు కేటాయించారని వివరించారు. నిధుల వినియోగంపై ఎస్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహిస్తామన్నారు.

ఇవీ చదవండి:KTR In Davos: రాష్ట్రంలో లులూ గ్రూపు పెట్టుబడులు

ABOUT THE AUTHOR

...view details