ఉదయం పూట పక్షుల కిలకిలారావాలే నగరవాసుల్ని నిద్ర లేపుతున్నాయి. జలాశయాలు, చెరువుల వద్ద వీటి కదలికలు పెరిగినట్లు పక్షుల సంరక్షణ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు. జన సంచారం లేకపోవడం వల్ల పిచ్చుకలు, చిలుకలు, టేలర్‌బర్డ్స్, గోరింకలు, బాబ్లర్స్ ప్రస్తుతం ఎక్కువ సంఖ్యలో కనిపిస్తున్నాయి. శివారు ప్రాంతాల్లో వీటి సంచారం అబ్బురపరుస్తోంది.
నకనకలాడుతున్నాయి..
లాక్‌డౌన్ పరిస్థితుల్లో నగరంలోని పక్షులకు తిండి గింజలు కరవయ్యాయి. ఎక్కడా మనుషులు కానరాకపోవడంతో ఆకలితో నకనకలాడుతున్నాయి. భానుడి భగభగల మధ్య దాహార్తితో అలమటించిపోతున్నాయి. ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవ్వడంతో వాటికి ఆహారం అందించేవారు కరువయ్యారు. కోఠి, అమీర్‌పేట్, ట్యాంక్‌బండ్, చార్మినార్ తదితర 15 ప్రాంతాల్లో పక్షులకు ఆహారం అందించే ప్రదేశాలున్నాయి.
పర్యాటకులు, నగరవాసులు ఆయా ప్రదేశాల్లో కొనుగోలు చేసిన దాణాను పక్షులకు వేస్తూ ఉండేవారు. ప్రస్తుతం ఎవరూ బయటికి వచ్చే పరిస్థితి లేకపోవడంతో పక్షులను పట్టించుకునేవారే కరవయ్యారు. నగరవాసులు వారి డాబాల పైన పక్షులకు ఆహారం, నీరు సమకూర్చి, మానవత్వాన్ని చాటాలని పక్షి ప్రేమికులు సూచిస్తున్నారు.