రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా మావోయిస్టు తూర్పు డివిజన్ కమిటీ కార్యదర్శి అరుణ పేరు మీద ఆడియో టేపు విడుదలైంది. జాబ్ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనకు మావోయిస్టు పార్టీ మద్దతిస్తుందని ఆడియో టేపులో పేర్కొన్నారు. నిరసన ప్రదర్శనలు ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదన్నారు. జగన్ ప్రభుత్వం మోసపూరిత విధానాలకు వ్యతిరేకంగా సమరశీలంగా ఉద్యమించాల్సిన అవసరం ఉందన్నారు. పాదయాత్ర సమయంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తానని హామీ ఇచ్చిన జగన్.. అధికారంలోకి వచ్చిన రెండేళ్ల తర్వాత కేవలం పదివేల ఉద్యోగాలతో పండగ చేసుకోమనటం దారణమని మండిపడ్డారు.
న్యాయమైన డిమాండ్లతో ఆందోళన చేపట్టిన విద్యార్థి, యువజన సంఘాలు నాయకులకు మావోయిస్టు పార్టీ తమ పూర్తి మద్దతునిస్తుందని చెప్పారు. నూతన విద్యావిధానం వల్ల సుమారు 24 వేల ప్రాథమిక పాఠశాలలు మూతబడుతున్నాయని.. దీనివల్ల 37 వేల మంది ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను కోల్పోతున్నారని ఆడియో టేపులో వివరించారు. ప్రభుత్వం తక్షణమే రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మన్యం ప్రాంతంలో జీవో నెంబరు 3ను అమలు చేసి వంద శాతం ఉద్యోగాలు గిరిజనులకే కేటాయించాలన్నారు. కేవలం ఆందోళనలు, రాస్తారోకోల ద్వారా నిరుద్యోగ సమస్య పరిష్కారం కాదని.. గత రెండేళ్ల పాలనలో జరిగిన అవినీతి అక్రమాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రజలకు సూచించారు.