ఏకైక రాజధానిగా అమరావతి(amaravati)నే కొనసాగించాలని రైతులు, మహిళలు చేస్తున్న ఉద్యమం 700వ రోజుకు చేరింది. మరోవైపు రాజధాని కోసం అమరావతి రైతులు, మహిళలు చేపట్టిన మహాపాదయాత్ర(maha padayatra) 16వ రోజుకు చేరింది. న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు చేపట్టిన పాదయాత్ర నేడు ప్రకాశం జిల్లాలోని విక్కిరాలపేట నుంచి కందుకూరు వరకు సాగనుంది. అమరావతి ఉద్యమం 700వ రోజుకు చేరిన సందర్భంగా రైతులు నేడు ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నారు. అవి..
- ఉ.7.30 గం.లకు అమరావతి రైతుల సర్వమత ప్రార్థనలు
- ఉ.8.15 గం.లకు అమరావతి అమరవీరులకు నివాళులు
- ఉ.8:30 గం.లకు రైతుల ప్రత్యేక నిరసన కార్యక్రమం
- ఉ.9 గం.లకు అమరావతి లక్ష్యసాధన ప్రతిజ్ఞ
- ఉ.9.30 గం.లకు దళిత మైనారిటీల అమరావతి సంకల్పం
- ఉ.10 గం.లకు మహిళల ప్రత్యేక మాలధారణ
- ఉ.10 నుంచి మ.12.30 వరకు అమరావతి ఉద్యమ గీతాల ఆలాపన
- మ.2.30 గం.లకు ఉద్యమ కాలాల్లో ముఖ్యమైన ఘట్టాలపై వ్యాఖ్యానం
- మ.3 నుంచి సా.5.30 వరకు పాదయాత్ర మార్గమధ్యలో కళ్లకు గంతలతో నిరసన
- సా.6 నుంచి రా.7 వరకు అమరావతి వెలుగు కార్యక్రమం
సోమవారం ఇలా సాగింది..
అమరావతి రైతుల మహాపాదయాత్ర 15వ రోజైన సోమవారం ఉదయం ప్రకాశం జిల్లాలో ఎం.నిడమనూరులో ప్రారంభమై, కె.ఉప్పలపాడు, చిర్రికూరపాడు మీదుగా 15 కిలోమీటర్లు సాగి సాయంత్రం కందుకూరు మండలం విక్కిరాలపేటలో ముగిసింది. రెండురోజులుగా కురిసిన వర్షానికి ఎం.నిడమలూరు నుంచి ఉప్పలపాడు వరకు ఉన్న రోడ్డు బురదమయమైంది. ఆ బురదలోనే మూడు కిలోమీటర్లు పాదయాత్ర ముందుకు సాగింది. ఉప్పలపాడు నుంచి చిర్రికూరపాడు వరకు ఏడు కిలోమీటర్లు మధ్యలో ఎక్కడా గ్రామాలు లేకపోయినా కట్టుబడిపాలెం, జరుగుమల్లి మండలాల ప్రజలు వచ్చి సంఘీభావం తెలిపారు. చిర్రికూరపాడుకు చెందిన 30 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు ఏడు కిలోమీటర్ల పొడవునా ‘రాష్ట్ర ఏకైక రాజధాని అమరావతే. రైతుల త్యాగాలు వృథాకావు’ వంటి నినాదాలతో తోరణాలు కట్టారు. పాలేరు వంతెనకు ఇరువైపులా పూలు, అరటిచెట్లు, బెలూన్లతో అలంకరించారు. పాదయాత్రికులతో పొగాకు రైతులు, కూలీలు మాట్లాడుతూ... ‘మీ కష్టం ఊరికే పోదు. మీరు బయటకు వచ్చి ఇబ్బందులపై పోరాటం చేస్తున్నారు. మేం పంటలు పండక, గిట్టుబాటు లేక, చేసిన కష్టమూ మిగలక అగచాట్లు పడుతున్నాం’ అని ఆవేదన పంచుకున్నారు.