తెలంగాణ

telangana

By

Published : Jan 22, 2021, 8:02 AM IST

ETV Bharat / city

పేదల ముంగిట ఆధునిక వైద్య పరీక్షలు

పేద ప్రజలకు చేరువగా ఉచిత రోగ నిర్ధారణ పరీక్షలను అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ప్రారంభించిన ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌’ పథకం సేవలను మరింతగా విస్తరించారు. ఇప్పటి వరకూ రక్త, మూత్ర పరీక్షలను మాత్రమే నిర్వహిస్తుండగా.. ఇకనుంచి ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ వంటి రేడియాలజీ పరీక్షలు కూడా అందుబాటులోకి రానున్నాయి.

hyderabad news
పేదల ముంగిట ఆధునిక వైద్య పరీక్షలు

పేదలకు ఆధునిక వైద్య పరీక్షల సదుపాయం అందుబాటులోకి రానుంది. ఇందుకోసం జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా ఎనిమిది కేంద్రాలను (హబ్‌) తీర్చిదిద్దారు. లాలాపేట, శ్రీరాంనగర్‌, అంబర్‌పేట, బార్కాస్‌, జంగంపేట, పానీపురా, పురానాపూల్‌, సీతాఫల్‌మండి పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకొల్పిన ఈ అధునాతన నిర్ధారణ పరీక్షల కేంద్రాలను నేడు మంత్రులు కేటీఆర్‌, ఈటల రాజేందర్‌, మహమూద్‌ అలీ, శ్రీనివాస యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు ప్రారంభించనున్నారు. త్వరలో మరో 16 ఏర్పాటుకానున్నాయి.

జేబుకు చిల్లు తప్పింది..

పేదల ప్రజలకు అనారోగ్య సమస్య వస్తే.. రోగ నిర్ధారణ పరీక్షలకే ఖర్చు తడిసి మోపెడవుతోంది. ఈ దుస్థితిని తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం 2018లో ‘తెలంగాణ డయాగ్నొస్టిక్స్‌’ పథకాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇందుకోసం హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్రివెంటివ్‌ మెడిసిన్‌ (ఐపీఎం) ఆవరణలో ప్రస్తుతమున్న ప్రయోగశాలకు అదనంగా సుమారు రూ. 3 కోట్లతో మరో అధునాతన పరీక్షల కేంద్రాన్ని నెలకొల్పారు.

మొదట పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ప్రారంభమైన ఈ పథకాన్ని క్రమేణా జీహెచ్‌ఎంసీ పరిధిలోని బస్తీ దవాఖానాలు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, వెల్‌నెస్‌ సెంటర్లకూ విస్తరించారు. ప్రస్తుతం 319 ఆసుపత్రుల్లో ఓపీ సేవల్లో 57 రకాల రక్త, మూత్ర పరీక్షలను నిర్వహిస్తున్నారు. గత మూడేళ్లలో దాదాపు 10 లక్షలమందికి పైగా పేద ప్రజలు ఈ పథకం కింద లబ్ధి పొందారని, దీనివల్ల ప్రజలు నిర్ధారణ పరీక్షల కోసం సుమారు రూ.15 కోట్ల వరకూ ఖర్చుపెట్టాల్సిన అవసరం తప్పిందని వైద్యవర్గాలు అంచనా వేశాయి. ఈ క్రమంలోనే మరిన్ని పరీక్షలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వైద్యఆరోగ్యశాఖ నిర్ణయించింది.

ప్రధానంగా రేడియాలజీ పరీక్షలు

  • 8 పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో ఈసీజీ, ఎక్స్‌రే, అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ నిర్వహించడానికి అధునాతన పరికరాలను అందుబాటులోకి తెచ్చారు.
  • ఓపీ సేవల్లో రేడియాలజీ సేవలు అవసరమైన రోగులకు ఆయా ఆసుపత్రుల్లోని వైద్యులు ఈ 8 కేంద్రాలకు పంపిస్తారు.
  • వీటిలో పరీక్షలు చేయడంతో పాటు ఫలితాలు వెంటనే రోగులకు అందజేస్తారు.
  • సాంకేతిక సహాయకులు చేసిన పరీక్ష ఫలితాన్ని అక్కడి వైద్యుడు ‘టెలీ రేడియాలజీ’ విధానంలో రేడియాలజిస్ట్‌కు పంపిస్తారు.
  • రేడియాలజిస్ట్‌ ఆ రిపోర్టును పరిశీలించి, అవసరమైన సూచనలను వైద్యునికి అందిస్తారు. ఈ క్రమంలో చికిత్సను అందచేస్తారు.
  • ఈసీజీని కూడా సాంకేతిక నిపుణులే చేస్తారు. పరీక్ష పూర్తికాగానే ఫలితం నేరుగా ‘స్టెమీ’ కేంద్రానికి వెళ్తుంది. అక్కడి కార్డియాలజిస్టులు, జనరల్‌ మెడిసిన్‌ వైద్యుల బృందం ఆన్‌లైన్‌లో పరీక్షిస్తుంది.
  • ఒకవేళ ఈసీజీలో తేడాలున్నాయని భావిస్తే.. అత్యవసర చికిత్సల కోసం ఉస్మానియా, నిమ్స్‌కు తరలిస్తారు. ఈ రెండు ఆసుపత్రుల్లో ‘స్టెమీ పథకం’లో భాగంగా ప్రత్యేక క్యాథ్‌ల్యాబ్‌లను నెలకొల్పారు.

ఉపయోగాలు ఇలా

  • ఈ 8 కేంద్రాల్లో అల్ట్రాసౌండ్‌ స్కాన్‌ అందుబాటులోకి తేవడం వల్ల గర్భిణులను పరీక్షించి గర్భస్థ శిశువులో సమస్యలను తొలిదశలోనే గుర్తించి, చికిత్స అందించడానికి వెసులుబాటు ఉంటుంది.
  • అల్ట్రాసౌండ్‌ పరీక్షతో పాటు డిజిటల్‌ సంతకంతో కూడిన ఫలితాన్ని కూడా వెంటనే ఇస్తారు.
  • ఈసీజీలో తేడాలను త్వరగా గుర్తించడం వల్ల గుండెపోటు రోగులకు వేగంగా చికిత్స అందించడానికి వీలవుతుంది. ప్రాణాపాయ ముప్పు నుంచి తప్పించవచ్చు.

ABOUT THE AUTHOR

...view details