వేతన జీవులకు భారీ ఊరట.. రూ.7లక్షల వరకు ఆదాయానికి నో ట్యాక్స్
వేతన జీవులకు మోదీ సర్కారు భారీ ఊరట కల్పించింది. వార్షిక ఆదాయం రూ.7లక్షల వరకు ఉన్నవారు పన్ను చెల్లించే అవసరం లేదని స్పష్టం చేసింది.
కేంద్ర బడ్జెట్లో మధ్యతరగతి వేతన జీవులకు భారీ ఉరట! లక్షలాది మందికి ప్రయోజనం కలిగేలా వ్యక్తిగత పన్ను రిబేట్ పరిమితిని రూ.7లక్షలకు పెంచుతున్నట్లు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈమేరకు ఆదాయపు పన్నుకు సంబంధించి కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. రూ.7 లక్షల వరకు ఆదాయం ఉన్న వ్యక్తులు మినహాయింపులు ఉపయోగించుకొని పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఇదే సమయంలో, శ్లాబుల సంఖ్యను 5కు తగ్గిస్తున్నట్లు వెల్లడించారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల్లో మినహాయింపుల కారణంగా ఏటా ప్రభుత్వానికి రూ.35 వేల కోట్ల ఆదాయం తగ్గనుందని నిర్మల వెల్లడించారు. కొత్త పన్ను విధానం డిఫాల్ట్‌గా అమలుకానుందని.. అయితే ఈ విధానాన్ని ఎంచుకునే అవకాశం పన్ను చెల్లింపుదారులకే వదిలేస్తున్నామని స్పష్టం చేశారు.
- కొత్త పన్ను విధానం ఇలా..
- రూ.7లక్షల వరకు ఆదాయం ఉన్నవారు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
- శ్లాబుల సంఖ్య 5కు తగ్గింపు. పన్ను మినహాయింపు పరిమితి రూ.3లక్షలకు పెంపు.
- ఎవరికి ఎంత పన్ను అంటే..?
- రూ.9లక్షల వార్షిక వేతనం పొందుతున్న వ్యక్తులు ఇకపై చెల్లించాల్సిన పన్ను రూ.45వేలు మాత్రమే. ప్రస్తుతం వీరు రూ.60వేలు చెల్లిస్తున్నారు.
- రూ.15 లక్షల వార్షిక వేతనం పొందే వ్యక్తులు ఇదివరకు రూ.1.87 లక్షలు చెల్లిస్తుండగా.. ఇప్పుడు అది రూ.1.5 లక్షలకు తగ్గనుంది.
- గరిష్ఠ సర్‌ఛార్జి రేటు ప్రస్తుతం 37 శాతంగా ఉండగా.. దాన్ని 25 శాతానికి తగ్గించారు. ఫలితంగా ఓ వ్యక్తి.. ఇదివరకు చెల్లించే పన్ను 42.74 శాతం ఉంటే.. ఇప్పుడది 39 శాతానికి తగ్గనుంది.
- ప్రభుత్వేతర వేతన ఉద్యోగులు రిటైర్మెంట్ సమయంలో తీసుకునే లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్‌పై పన్ను మినహాయింపును రూ.3లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచుతున్నట్లు నిర్మల వెల్లడించారు.
- వేతన ఉద్యోగులకు ఇచ్చే రూ.50వేల స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త పన్ను విధానం కింద కొనసాగించాలని నిర్ణయించారు.