Small Saving Schemes Latest Interest Rates :ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికానికి చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను ఖరారు చేసింది ప్రభుత్వం. 5 ఏళ్ల రికరింగ్ డిపాజిట్లపై వడ్డీ రేటును 6.5 శాతం నుంచి 6.7 శాతానికి పెంచింది. మిగిలిన సేవింగ్ స్కీమ్స్ వడ్డీ రేట్లను యథాతథంగానే ఉంచింది. 2023 అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 మధ్య కాలానికి ఈ వడ్డీ రేట్లు వర్తింపు అవుతాయని కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఓ నోటిఫికేషన్ జారీ చేసింది.
నిరాశ కలిగిన పాపులర్ పథకాలపై వడ్డీ రేట్లు..
ప్రస్తుతం దేశంలో ప్రజల్లో మంచి ప్రజాదరణ ఉన్న పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన వంటి పథకాల వడ్డీరేట్లలో ఎలాంటి మార్పు లేదు. దీంతో పాటు ఇతర పథకాల వడ్డీ రేట్లను కూడా ప్రభుత్వం మార్చకపోవడం నిరాశ కలిగించింది.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్‌పై 7.1%, సేవింగ్స్ డిపాజిట్‌పై 4.0%, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ 7.7%, సుకన్య సమృద్ధి యోజన 8%, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 8.2%, కిసాన్ వికాస్ పత్రపై 7.5%, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్‌పై 7.4% వడ్డీ లభించనుంది. తాజా వడ్డీ రేట్లలో సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్‌కు అత్యధికంగా 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. కనిష్ఠంగా సేవింగ్స్ డిపాజిట్‌కు 4.0 శాతం వడ్డీ అందనుంది.