DA Hike News Central Government Employees :కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు గుడ్‌న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు 4 శాతం డీఏ పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయాన్నికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇస్తున్న డీఏ 46 శాతానికి పెరిగినట్లైంది. ప్రస్తుతం వీరికి 42 శాతం డీఏ ఇస్తున్నారు. ఏడో వేతన సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు లాభం!
DA Hike News Today :సాధారణంగా ఏడాదికి రెండుసార్లు డీఏ పెంచుతుంది కేంద్రం. డీఏ సవరించిన నేపథ్యంలో రాష్ట్రాలు సైతం ఈ మేరకు తమ ఉద్యోగులకు డీఏ పెంచే అవకాశం ఉంది. కేంద్రం నిర్ణయం సుమారు 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల మంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.
రైల్వే ఉద్యోగులకు 78 రోజుల బోనస్
Railway Employee Bonus 2023 : రైల్వే ఉద్యోగులకు ఏటా ఇచ్చే ఉత్పతాదకత ఆధారిత బోనస్‌కు సైతం కేంద్ర కేబినెట్ ఈ సందర్భంగా ఆమోదం తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను 78 రోజులకు సమానమైన వేతనాన్ని బోనస్‌గా చెల్లించనున్నారు. ఆర్‌పీఎఫ్ సిబ్బంది మినహా ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలెట్లు, ట్రెయిన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్ వైజర్లు, టెక్నీషియన్లు.. ఇలా అర్హులైన 11 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకోసం రూ.1968.87 కోట్లు వెచ్చించనున్నారు.
లద్దాఖ్‌లో ట్రాన్సిమిషన్ లైన్ ఏర్పాటు
Powergrid Leh Project : లద్దాఖ్‌లోని 13 గిగావాట్ల పునరుత్పాదక విద్యుత్తు ప్రాజెక్టు నుంచి విద్యుత్తు తీసుకునేందుకు వీలుగా 20,773 కోట్ల వ్యయంతో ట్రాన్సిమిషన్ లైన్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రధాని నరేంద్ర మోదీ పంద్రాగస్టు ప్రసంగంలో.. లద్దాఖ్‌లో 7.5 గిగావాట్ల సామర్థ్యం కలిగిన సౌర విద్యుత్తు పార్క్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.
లద్దాఖ్‌లో 13 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి సామర్థ్యంతోపాటు 12 గిగావాట్ల బ్యాటరీ స్టోరేజీ సిస్టంను ఏర్పాటు చేయాలని విస్తృతమైన క్షేత్రస్థాయి సర్వే తర్వాత సంబంధిత మంత్రిత్వ శాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. పెద్దమొత్తంలో విద్యుత్తు తీసుకునేందుకు అంతర్రాష్ట్ర ట్రాన్సిమిషన్ లైన్ ఏర్పాటు తప్పనిసరి అని అధికారవర్గాలు తెలిపాయి. జాతీయ గ్రిడ్‌తో అనుసంధానం చేసేందుకు వీలుగా హిమాచల్‌ప్రదేశ్, పంజాబ్, హరియాణాలోని కైథల్ వరకు ఈ ట్రాన్సిమిషన్ లైన్ ఏర్పాటు చేయనున్నారు.
గోధుమల కనీస మద్దతు ధర పెంపు..
Wheat Minimum Support Price : మరోవైపు, గోధుమల కనీస మద్దతు ధరను క్వింటాల్‌కు రూ.150 చొప్పున పెంచింది కేంద్రం. 2024-25 సంవత్సరానికి కనీస మద్దతు ధరను రూ.2275గా నిర్ణయించినట్లు తెలిపింది. 2014లో మోదీ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత గోధుమల కనీస మద్దతు ధర ఈ స్థాయిలో పెరగడం ఇదే తొలిసారి. మొత్తం ఆరు రబీ పంటలకు కనీస మద్దతు ధర పెంచుతున్నట్లు అనురాగ్ ఠాకూర్ తెలిపారు.