ఆర్థిక వ్యవస్థపై కొవిడ్-19 ప్రభావాన్ని పరిమితం చేసేందుకు ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు సరైన దిశలో తీసుకున్న నిర్ణయాలుగా రిజర్వు బ్యాంక్ మాజీ గవర్నర్ బిమల్ జలాన్ అభిప్రాయపడ్డారు. వృద్ధి రేటు మరింతగా క్షీణించకుండా ఈ చర్యలు ఉపయోగపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. 1991తో పోలిస్తే ఇప్పుడు భారత్ పరిస్థితి పూర్తి భిన్నమని జలాన్ అన్నారు. ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కొనేందుకు ప్రస్తుతం భారత్ వద్ద తగినన్ని వనరులు, విదేశీ మారకం నిల్వలు ఉన్నాయని అన్నారు.
"కేంద్ర ఆర్థిక మంత్రి ప్రకటించినవి చాలా మంచి నిర్ణయాలు. అయితే డిమాండు కోణంలో కాకుండా సరఫరా కోణంలోనే ఈ నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనం చూడొచ్చు. ఆర్థిక వ్యవస్థపరంగా చూస్తే.. అధిక ద్రవ్యలోటు అధిక వృద్ధికి దారి తీస్తుందని ఎవరూ అనుకోరు." -బిమల్ జలాన్, ఆర్బీఐ మాజీ గవర్నర్