తెలంగాణ

telangana

ETV Bharat / business

వాయిదా పద్ధతిలో కొనుగోళ్లు చేస్తున్నారా? - వ్యాపార వార్తలు

స్మార్ట్‌ ఫోను కొనాలనుంది కానీ.. ఒకేసారి కొనేంత డబ్బు లేదా? క్రెడిట్‌ కార్డుతో కొనండి బిల్లును ఈఎంఐల రూపంలోకి మార్చుకోండి అనే ప్రకటలను చాలా మందికి సుపరిచితమే. ఇలాంటి ప్రకటనలతో.. ప్రతీదీ వాయిదా పద్ధతుల్లో కొనేందుకు ఇటీవల బాగా అలవాటయ్యాం. మీరూ.. ఇలాంటి కొనుగోళ్లకు సిద్ధం అవుతుంటే.. ఒక్కసారి ఈ విషయాలూ తెలుసుకోండి.

EMI
ఈఎంఐ

By

Published : Dec 22, 2019, 9:19 PM IST

క్రెడిట్‌ కార్డు ద్వారా కొని, ఆ బిల్లును వాయిదాల రూపంలోకి మార్చడం అంటే.. అది వ్యక్తిగత రుణంలాంటిదే. మీరు బ్యాంకు నుంచి రుణం తీసుకున్నారనుకోండి.. దాన్ని వాయిదాల్లోనే చెల్లిస్తారు. ఇందులో అసలు, వడ్డీ కలిసి ఉంటాయి. క్రెడిట్‌ కార్డు ద్వారా తీసుకున్నప్పుడు కొన్నిసార్లు వడ్డీ ఉండకపోవచ్చు. కానీ, ఒక్క ఈఎంఐని మీరు చెల్లించకపోయినా వడ్డీతోపాటు, అపరాధ రుసుములూ ఉంటాయి. దీని ప్రభావం క్రెడిట్‌ స్కోరుపైనా పడుతుంది.

ఈ వివరాలు క్షుణ్ణంగా తెలుసుకోండి..

చాలా సందర్భాల్లో ప్రాసెసింగ్‌ ఫీజుల గురించి మనం విస్మరిస్తుంటాం. మీ కార్డును, కొనుగోలు మొత్తాన్ని బట్టి ఈఎంఐ ప్రాసెసింగ్‌ ఫీజు 1-3శాతం వరకూ ఉండవచ్చు. చూడ్డానికి ఇది పెద్ద మొత్తంగా అనిపించకపోయినా.. ఈఎంఐగా మార్చే ముందు ఈ విషయాన్ని గమనించాలి. కార్డు నిబంధనలను క్షుణ్నంగా చదవడం లేదా కార్డు సేవా కేంద్రానికి ఫోన్‌ చేసి, ఈ వివరాల గురించి అడగండి.

వడ్డీ చూసుకోండి..

కొన్ని ఉత్పత్తులను క్రెడిట్‌ కార్డును ఉపయోగించి కొన్నప్పుడు, వాయిదాల్లోకి మార్చుకున్నా ఎలాంటి వడ్డీ ఉండదు. ప్రాసెసింగ్‌ ఫీజులోనూ రాయితీ ఉంటుంది. కొన్నిసార్లు తక్కువ వడ్డీకీ ఇస్తుంటారు. ఇదంతా ఆ వస్తువును కొనుగోలు చేసేప్పుడే సంబంధిత విక్రయ సంస్థలో ఈఎఐంగా మార్చుకున్నప్పుడే. అలాకాకుండా.. మీరు కొనుగోలు చేసి, ఆ బిల్లు మొత్తాన్ని ఈఎంఐగా మార్చుకోవాలనుకుంటే.. ఆ బిల్లు మొత్తంపై 12-24 శాతం వరకూ వడ్డీ చెల్లించాల్సి వస్తుంది. కాబట్టి, ఈ విషయాన్ని స్పష్టంగా తెలుసుకోండి. పండగల వేళ ఇచ్చే రాయితీలను మరికొంత కాలం కొనసాగించే అవకాశం ఉంటుంది. వీటి గురించి ఓ సారి పరిశీలించండి.

ముందుగానే చెల్లిస్తే..

ఈఎంఐలో తీసుకున్నంత మాత్రాన పూర్తిగా వ్యవధి తీరే వరకూ వాయిదాలు చెల్లించాలని లేదు.. చేతిలో డబ్బు ఉంటే ముందుగానే ఆ రుణ భారాన్ని దించుకోవచ్చు. ఇలా చేసినప్పుడు ముందస్తు చెల్లింపు రుసుములను విధించే అవకాశం ఉంటుంది. అప్పటి వరకూ ఉన్న అసలుపై 3శాతం వరకూ రుసుము విధిస్తుంటాయి బ్యాంకులు. క్రెడిట్‌ కార్డు సంస్థలను బట్టి, ఈ రుసుములు మారుతుంటాయి. కార్డు బిల్లులను ఈఎంఐగా మార్చుకునేప్పుడు.. ఈ ముందస్తు చెల్లింపు రుసుము గురించి అడిగి తెలుసుకోండి. ముందుగానే చెల్లించడం వల్ల వడ్డీ ఆదా అవుతుంది. కానీ, రుసుములు ఉంటే పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు.

పరిమితి తగ్గుతుంది..

క్రెడిట్‌ కార్డును ఉపయోగించి ఒక వస్తువును కొన్నారు. ఆ బిల్లును ఈఎంఐగా మార్చారు.. అప్పుడు ఆ బిల్లు మొత్తం మేరకు కార్డు పరిమితి తగ్గుతుంది. ఉదాహరణకు.. మీ కార్డు పరిమితి రూ.2లక్షలు ఉందనుకుందాం. మీరు దీన్ని వాడి రూ.లక్షతో టీవీ కొన్నారు. నెలకు రూ.5,000 చొప్పున 24 నెలల పాటు చెల్లించాలని వాయిదాలుగా నిర్ణయించారనుకుందాం (రూ.5,000x24=1,20,000). ఇందులో రూ.20వేలు వడ్డీ, ఇతర రుసుములు అన్నమాట. ఇప్పుడు మీ కార్డు పరిమితిలో మిగిలిన రూ.80,000 మాత్రమే ఉంటాయి. మీరు ప్రతి నెలా వాయిదా చెల్లిస్తూ ఉంటే.. మీ కార్డు పరిమితి ఆ మేరకు పెరుగుతుంది. మీరు మొత్తం వాయిదాలు చెల్లించడం పూర్తయిన తర్వాతే కార్డు మళ్లీ రూ.2,00,000 పరిమితికి చేరుతుంది.

క్రెడిట్‌ కార్డును కాస్త విజ్ఞతతో వాడుకుంటే.. ఎలాంటి వడ్డీ భారం పడకుండా అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు వీలవుతుంది. అదే సమయంలో మీ పొదుపు మొత్తాన్ని ఒకేసారి చెల్లించకుండా.. ఈఎంఐల రూపంలో చెల్లించే అవకాశమూ ఇస్తాయి. క్రెడిట్‌ కార్డు ఈఎంఐ అవకాశం చాలా వరకూ అనుకూలంగానే ఉంటుంది. కొన్ని వ్యాపార సంస్థల వద్ద, కొన్ని బ్రాండ్లను కొనుగోలు చేసినప్పుడు అదనపు ప్రయోజనాలూ ఉంటాయి. ఇలాంటి వాటిని గుర్తించి, మీకు అవసరమైన వస్తువులు అక్కడ ఉన్నాయా చూసుకోండి. ఎంత ఈఎంఐ అవకాశం ఉన్నా.. మీ ఆర్థిక పరిస్థితిని దాటి కొనుగోళ్లు ఉండకుండా జాగ్రత్త పడండి. కార్డు బిల్లులను, వాయిదాలను సకాలంలో చెల్లించడమూ ముఖ్యమే. లేకపోతే మీ క్రెడిట్‌ స్కోరు తగ్గే ఆస్కారం ఉంది.

ఇదీ చూడండి:పాన్​-ఆధార్​ అనుసంధానానికి గడువు దగ్గరపడింది!

ABOUT THE AUTHOR

...view details