తెలంగాణ

telangana

ETV Bharat / business

Health Insurance: ఆరోగ్య బీమా టాపప్‌ చేయించారా?

Health Insurance: కొవిడ్‌-19 భయాలు ఇంకా వదలనే లేదు. మళ్లీ 'ఒమిక్రాన్‌' ఆందోళనలు మొదలయ్యాయి. ప్రతి ఒక్కరూ దీన్ని ఎదుర్కొనేందుకు తగిన జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. అదే సమయంలో ఆర్థిక విషయాల్లోనూ అప్రమత్తంగా ఉండాల్సిందే. ముఖ్యంగా ఆరోగ్య బీమా విషయంలో. ఇప్పటికే ఉన్న పాలసీని ఇప్పటికిప్పుడు మార్చడం సాధ్యం కాదు కాబట్టి, దానికి అదనపు రక్షణగా టాపప్‌ పాలసీలను ఎంచుకోవడం ఇప్పుడు అవసరంగా కనిపిస్తోంది.

Health Insurance
Health Insurance

By

Published : Dec 17, 2021, 3:45 PM IST

Health Insurance: ప్పటికప్పుడు పెరుగుతున్న వైద్య ఖర్చులతో ఆర్థిక భారం పడకుండా చూసుకోవాలనుకున్నప్పుడు టాపప్‌ పాలసీలు ఒక మార్గం. ఇప్పటికే ఉన్న బీమా పాలసీ మొత్తం పూర్తయ్యాక అదనంగా అయ్యే ఖర్చును తట్టుకునేందుకు ఇవి సహాయం చేస్తాయి. వ్యక్తిగత పాలసీ లేదా కుటుంబానికి అంతటికీ వర్తించే ఫ్యామిలీ ఫ్లోటర్‌ కానీయండి.. వాటికి టాపప్‌ చేయించుకోవచ్చు.

అధిక మొత్తానికి కొత్త పాలసీని కొనే బదులు ఉన్న పాలసీకే తక్కువ ప్రీమియంతో ఈ టాపప్‌ పాలసీని జత చేయొచ్చు. ఇదే విలువతో పూర్తిస్థాయి బీమా పాలసీ తీసుకుంటే అయ్యే ప్రీమియం ఖర్చులో 30-40 శాతం తక్కువే ఉంటుంది.

ప్రాథమిక పాలసీ పూర్తిగా వాడుకొని, నిర్ణీత పరిమితి దాటాకే టాపప్‌ పాలసీలు పనిచేస్తాయి. ఉదాహరణకు మీరు.. రూ.10లక్షల టాపప్‌ పాలసీ తీసుకున్నారనుకుందాం. దీనికి తప్పనిసరి మినహాయింపు రూ.5లక్షలుగా నిర్ణయించారనుకుందాం. ఆసుపత్రిలో చేరినప్పుడు ఒకేసారి రూ.5లక్షలకన్నా అధికంగా ఖర్చయిందనుకోండి. ఆ అధికంగా అయిన మొత్తాన్ని టాపప్‌ పాలసీ చూసుకుంటుందన్నమాట. ఒకవేళ ఆరోగ్య బీమా పాలసీ లేదనుకోండి. అప్పుడూ కొంత మొత్తం మినహాయింపుతో టాపప్‌ పాలసీని తీసుకునే వీలుంటుంది.

ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే.. టాపప్‌ పాలసీ తీసుకోవడం పూర్తిస్థాయి ఆరోగ్య బీమాకు ప్రత్యామ్నాయం కాదు.

సూపర్‌ టాపప్‌ పాలసీలు కాస్త భిన్నంగా ఉంటాయి. ఏడాదిలో పరిమితికి మించి వైద్య ఖర్చులు అయినప్పుడే సూపర్‌ టాపప్‌ పాలసీ పరిహారాన్ని ఇస్తుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి రూ.5లక్షల ప్రాథమిక పాలసీ ఉందనుకుందాం. ఒకసారి ఆసుపత్రిలో చేరినప్పుడు రూ.2లక్షలు, మరోసారి చికిత్సకు రూ.4లక్షలు అయ్యిందనుకుందాం. ఏడాదిలో రూ.5లక్షలు దాటింది కాబట్టి, సూపర్‌ టాపప్‌ పాలసీ రూ.లక్షను పరిహారంగా చెల్లిస్తుంది.

Health Insurance Top up Policy: టాపప్‌ పాలసీ లేదా సూపర్‌ టాపప్‌ పాలసీల్లో దేన్ని ఎంచుకున్నా.. నిబంధనలు, వేటికి వర్తిస్తుంది.. వేటికి వర్తించదు అనే అంశాలను క్షుణ్నంగా తెలుసుకోవాలి. ముందస్తు వ్యాధులకు వేచి ఉండే వ్యవధి ఎంత? ఆసుపత్రిలో చేరకముందు, ఇంటికి వెళ్లాక అయ్యే ఖర్చులనూ పరిగణనలోనికి తీసుకుంటారా? ప్రీమియం చెల్లింపు, క్లెయిం పరిష్కారంలాంటివన్నీ చూసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి.

  • ఈ టాపప్‌ పాలసీలకు చెల్లించిన ప్రీమియానికీ సెక్షన్‌ 80డీ కింద మినహాయింపు క్లెయిం చేసుకోవచ్చు.
  • ప్రాథమిక పాలసీ ఏ బీమా సంస్థ దగ్గరుంటే అక్కడే టాపప్‌ పాలసీ తీసుకోవాలన్న నిబంధన ఉండదు. మీ ఇష్టం ఉన్న బీమా సంస్థ నుంచి ఈ పాలసీలను ఎంచుకోవచ్చు.
  • వ్యక్తిగత, ఫ్యామిలీ ఫ్లోటర్‌, బృంద బీమా పాలసీలతోనూ వీటిని జత చేయొచ్చు.
  • మినహాయింపు పరిమితి ఎక్కువగా ఉంటే.. ప్రీమియం అంత మేరకు తగ్గుతుంది.

ప్రస్తుతం ఉన్న పాలసీ.. అయ్యే వైద్య ఖర్చుల మధ్య వ్యత్యాసాన్ని టాపప్‌, సూపర్‌ టాపప్‌ పాలసీలు భర్తీ చేస్తాయి. కొవిడ్‌ లాంటి ప్రత్యేక సందర్భాల్లో వీటిని ఎంచుకోవడం వల్ల ఆర్థిక రక్షణ కల్పించుకోవచ్చు. అవసరం లేదు అనుకుంటే ఆపేసినా ఇబ్బంది ఉండదు.

ఇవీ చూడండి:పెన్షన్‌ ప్లాన్‌ తీసుకుంటున్నారా? ఈ 5 అంశాలు కీలకం!

Covid Vaccine For Children: 'ఆరు నెలల్లో పిల్లలకు కరోనా టీకా​'

ABOUT THE AUTHOR

...view details