ముంబయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ రైల్వే స్టేషన్ (సీఎస్‌ఎంటీ)ను అత్యాధునికంగా అభివృద్ధి చేసి, దాన్ని నిర్వహించే కాంట్రాక్టును దక్కించుకోడానికి జీఎంఆర్ గ్రూపు ప్రయత్నిస్తోంది. దీని కోసం ఐఆర్‌ఎస్‌డీసీ (ఇండియన్ రైల్వే స్టేషన్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్) చేపట్టిన బిడ్డింగ్ ప్రక్రియలో ప్రాథమికంగా తొమ్మిది సంస్థలు ఎంపికయ్యాయి.
ఇందులో జీఎంఆర్ ఎంటర్‌ప్రైజెస్‌తో పాటు అదానీ రైల్వే ట్రాన్స్‌పోర్ట్, గోద్రెజ్ ప్రాపర్టీస్, ఓబరాయ్ రియాల్టీ, ఐఎస్‌క్యూ ఏషియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్, కల్పతరు పవర్ ట్రాన్స్‌మిషన్, యాంకరేజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్స్ హోల్డింగ్స్, బ్రూక్‌ఫీల్డ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, మారిబస్ హోల్డింగ్స్ ఉన్నాయి. ఈ సంస్థలు ఇప్పుడు ఆర్‌ఎఫ్‌పీ (రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్) దాఖలు చేయాల్సి ఉంటుంది. చివరిగా ఎంపికైన సంస్థకు డీబీఎఫ్‌ఓటీ (డిజైన్, బిల్డ్, ఫినాన్స్, ఆపరేట్, ట్రాన్స్‌ఫర్) పద్దతిలో ఈ కాంట్రాక్టు లభిస్తుంది. సీఎస్‌ఎంటీ రైల్వే స్టేషన్ అభివృద్ధి ప్రాజెక్టు విలువ రూ,1,642 కోట్లుగా అంచనా వేశారు.