ప్రస్తుతం స్మార్ట్ ఫోన్ సంస్థల మధ్య కెమెరా పిక్సెల్స్ పోటీ నడుస్తోంది. ఈ ఏడాది ఈ పోటీ మరీ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అయితే దిగ్గజ సంస్థలైన యాపిల్, శాంసంగ్, గూగుల్ పిక్సెల్‌లు మాత్రం తమ ప్రీమియం మోడల్ ఫోన్లలో ఇంకా 12 మెగా పిక్సెల్ కెమెరాను మాత్రమే వినియోగిస్తున్నాయి. ఇతర సంస్థలు తక్కువలో తక్కువ 40 మెగా పిక్సెల్ కెమెరాను తమ ఫోన్లలో పొందుపరుస్తున్నాయి.
ఇటీవల షియోమీ 108 మెగా పిక్సెల్ కెమెరా ఫోన్‌ను ఆవిష్కరించింది (భారత్‌లో విడుదల కావాల్సి ఉంది). మరి దిగ్గజ సంస్థలు భారీ కెమెరాల వైపు ఎందుకు మొగ్గుచూపడం లేదు అంటే.. స్మార్ట్ ఫోన్లకు 12 మెగా పిక్సెల్ కెమెరా చాలు అనే సమాధానాలు వినిపిస్తున్నాయి.
స్మార్ట్ఫోన్లలో 12 మెగా పిక్సెల్‌ల కెమెరా చాలు అనేందుకు... ఫోన్ స్టోరేజీ, ప్రాసెసింగ్ సమయం, తక్కువ కాంతిలో ఫోటో తీయడం వంటి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇవన్నీ బ్యాటరీ, కెమెరా పనితీరులపై ప్రభావం చూపుతాయి.
ఎక్కువ పిక్సెల్=ఎక్కువ డేటా..
ఫోన్ కెమెరా ఎక్కువ మెగా పిక్సెల్ ఉందంటే.. దానర్థం ఎక్కువ ఫొటోలను ప్రాసెస్ చేసేందుకు ఎక్కువ డేటాను తీసుకుంటాయి. దీని వల్ల బ్యాటరీ లైఫ్ తొందరగా తగ్గిపోతుంది. మరీ ముఖ్యంగా నైట్ మోడ్‌లో ఫొటోలు తీసేటప్పుడు.. పోట్రేట్ ఫోటోలకు ఎక్కువ ప్రాసెస్ అవసరం అవుతుంది.
ఫొటోలు ప్రాసెస్ చేయడం సహా వాటిని స్టోరేజ్ చేసేందుకూ ఎక్కువ సైజును ఆక్రమిస్తాయి.