తెలంగాణ

telangana

ETV Bharat / business

క్రెడిట్ స్కోర్ తెలిపే బ్యూరోలు ఇవే

క్రెడిట్ స్కోర్.. రుణం తీసుకోవాలంటే ముందు వినిపించే మాట ఇదే. ఇంతకీ ఏమిటి ఈ క్రెడిట్ స్కోర్? ఎవరు దీన్ని నిర్ణయిస్తారు? బ్యాంకులు, ఇతర రుణ సంస్థలు క్రెడిట్​ స్కోర్​ను ఎలా తెలుసుకుంటాయి? అనే సందేహాలకు సమాధానం మీ కోసం.

credit bureaus
క్రెడిట్​ బ్యూరోలు

By

Published : Apr 14, 2021, 3:38 PM IST

ఏ రుణం కావాలన్నా తరచూ వినిపించే మాట క్రెడిట్‌ స్కోర్‌. దీన్ని ఎవరు జారీ చేస్తారు? దీని అవసరం ఎంత అనే విషయాలు తెలియక సతమతమవుతూ ఉంటారు. క్రెడిట్‌ కార్డు తీసుకోవాలన్నా.. గృహ, వ్యక్తిగత రుణం కోసం దరఖాస్తు చేసుకున్నా.. బ్యాంకులు మన క్రెడిట్‌ స్కోర్‌నే ప్రామాణికంగా చూస్తాయి. క్రెడిట్‌ స్కోర్‌ను క్రెడిట్‌ సమాచార కంపెనీలు జారీ చేస్తాయి.

వ్యక్తులకు రుణం ఇవ్వాలంటే రుణ సంస్థలు క్రెడిట్‌ బ్యూరోలను ఆశ్రయిస్తుంటాయి. బ్యాంకులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు క్రెడిట్‌ బ్యూరోల వద్ద సభ్యత్వం పొంది వ్యక్తుల రుణ చరిత్రలను తెలుసుకుంటాయి. అలాగే వ్యక్తులు కూడా తమ రుణచరిత్ర నివేదికలను క్రెడిట్‌ బ్యూరోల వద్ద పొందవచ్చు. ప్రస్తుతం దేశంలో వ్యక్తుల క్రెడిట్ స్కోర్‌లను అందించే సంస్థ‌లు సిబిల్‌, ఈక్విఫాక్స్‌, ఎక్స్‌పీరియన్‌, సీఆర్‌ఐఎఫ్‌ హైమార్క్‌. వీటిలో సిబిల్ ఎక్కువ ప్రాచుర్యం పొందింది.

సిబిల్:

సిబిల్‌ అంటే క్రెడిట్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో(ఇండియా) లిమిటెడ్‌. వ్యక్తుల రుణ సమాచారాన్ని సేకరించ‌డం ద్వారా క్రెడిట్‌ స్కోర్‌ను సిబిల్ త‌యారుచేస్తుంది. క్రెడిట్ స్కోర్‌ను పొందాల‌నుకునేవారు నిర్ణీత‌ రుసుము చెల్లించి సిబిల్‌ వెబ్‌సైట్ ద్వారా ఈ స‌మాచారం తెలుసుకోవ‌చ్చు.

ఈక్విఫాక్స్‌:

వ్యక్తులు తీసుకున్న రుణాల గురించి ముఖ్యమైన వివరాలను ఈ సంస్థ సేకరిస్తుంది. ఈక్విఫాక్స్‌ వద్ద సభ్యత్వం ఉన్న సంస్థలు మాత్రమే వ్యక్తుల రుణ‌ సమాచారాన్ని స్వీకరించగలుగుతాయి. ఈక్విఫాక్స్‌ వద్ద మూడు నెలలకు ఒకసారి నివేదిక పొందే వీలుంది.

ఆయా రుణ సంస్థలు అందించే సమాచారాన్నే రుణ చరిత్ర నివేదికలో పొందుపరుస్తారు. ఇందులో ఏవైనా తప్పులు దొర్లితే రుణసంస్థను సంప్రదించాల్సి ఉంటుంది. వ్యక్తులు చేసే రుణ చెల్లింపుల గురించి ఎప్పటికప్పుడు నివేదికల్లో అప్‌డేట్‌ చేస్తూ ఉంటారు.

ఎక్స్‌పీరియన్‌:

ఎక్స్‌పీరియన్‌ రుణ చరిత్ర నివేదికలో.. వ్యక్తులు తీసుకున్న రుణాలు, రుణ దరఖాస్తులకు సంబంధించిన సమాచారం ఉంటుంది.

సభ్యత్వం కలిగిన సంస్థలకు వ్యక్తుల రుణ రుణచరిత్ర అందుబాటులో ఉంటుంది.

ఎలాంటి రుణం, రుణం మంజూరు తేదీ, చెల్లించాల్సిన మిగులు, చెల్లింపుల విధానం, డిఫాల్టర్‌గా మారి ఉంటే సంబంధిత‌ వివరాలు ఇందులో పొందుపరుస్తారు.

సీఆర్‌ఐఎఫ్‌ హైమార్క్‌:

బ్యాంకింగ్‌, ఆర్థిక సేవలు, బీమా, టెలికాం తదితర రంగాల్లో హైమార్క్‌ సేవలను అందిస్తుంది.

రుణ చ‌రిత్ర‌తో పాటు ఆర్థిక విశ్లేష‌ణ‌, రుణాల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించి సూచ‌న‌లు వంటి సేవ‌ల‌ను అందిస్తుంది ఈ సంస్థ‌.

ఇదీ చదవండి:క్రెడిట్ కార్డును పొందలేకపోతున్నారా? ఇది మీ కోసమే..

ABOUT THE AUTHOR

...view details