తెలంగాణ

telangana

By

Published : Feb 11, 2020, 7:58 PM IST

Updated : Mar 1, 2020, 12:36 AM IST

ETV Bharat / business

అయ్యో.. స్మార్ట్​ఫోన్​ పరిశ్రమకూ కరోనా ఎఫెక్ట్​

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా ప్రభావం ఇప్పుడు స్మార్ట్​ఫోన్ పరిశ్రమపై పడింది. చైనాలో కరోనా ప్రభావం తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్న కారణంగా అక్కడ చాలా వరకు ఫ్యాక్టరీలు కార్యకలాపాలు నిలిపేశాయి. ఈ నేపథ్యంలో చైనాపై అధికంగా ఆధారపడే భారత స్మార్ట్​ఫోన్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోంది.

carona effect on smartphone
కరోనా దెబ్బకు స్మార్ట్​ఫోన్ పరిశ్రమ విలవిల

భారత్​లో స్మార్ట్​ఫోన్ల పరిశ్రమను కరోనావైరస్​ తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. స్మార్ట్​ఫోన్ల విడిభాగాలు, ఇతర ముడి పరికరాల కోసం భారత్​ చైనాపైనే అధికంగా ఆధారపడుతోంది. అయితే చైనాలో కరోనా వైరస్​ విజృంభిస్తోన్న కారణంగా చాలా వరకు ఆ దేశ సంస్థలు కార్యకలాపాలు నిలిపేశాయి. ఫలితంగా చైనా నుంచి స్మార్ట్​ఫోన్ల పరిశ్రమకు వచ్చే ముడి సరుకు సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.

నిశితంగా పరిశీలిస్తున్నాం..

చైనాలో మూతపడిన ఫ్యాక్టరీలు మరికొన్ని రోజుల్లో తెరుచుకుంటాయా? ఈ వారంలో సరఫరా తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయా అనే అంశాన్ని భారత పరిశ్రమ నిశితంగా పరిశీలిస్తోంది.

"అవును, భారత స్మార్ట్​ఫోన్ల పరిశ్రమపై ఇప్పటికే కరోనా ప్రభావం పడింది. కొన్ని రకాల మోడల్స్​ ప్రభావితమయ్యాయి. ఇది ఇంకా ప్రారంభ దశ అయినందున ఇప్పుడే ఒక నిర్ణయానికి రాలేము. "- పంకజ్​ మహీంద్రూ, ఇండియన్​ సెల్యులార్​ అండ్​ ఎలక్ట్రానిక్స్​ అసోసియేషన్​ ఛైర్మన్​

అయితే మార్కెట్ విశ్లేషకులు మాత్రం క్షేత్రస్థాయిలో పరిశ్రమ పరిస్థితులు అధ్వాన్నంగా ఉన్నాయంటున్నారు. స్మార్ట్​ఫోన్​ పరికరాలు ప్రధానంగా చైనా నుంచి వస్తునందున మార్కెట్​తో పాటు డిమాండ్​ మందకొడిగా సాగుతున్నట్లు చెబుతున్నారు.

సరఫరాపై దిగ్గజ సంస్థలైన షియోమీ, ఒప్పో, వివో, రియల్​మీ, పోకో వంటి సంస్థలను సంప్రదించగా ఎలాంటి స్పందన రాలేదు.

మొబైల్ కాంగ్రెస్​పై కరోనా పడగ..

కరోనా దెబ్బతో మొబైల్ ప్రపంచ మొబైల్ కాంగ్రెస్​ (డబ్ల్యూఎంసీ)పై తీవ్ర ప్రభావం పడనుందన్న సంకేతాలు వస్తున్నాయి. ఇప్పటికే ఎరిక్సన్​, అమెజాన్​, సోనీ సహా పలు ఇతర సంస్థలు.. స్పెయిన్​లోని బర్సెలినాలో ఈ నెల 24-27 తేదీల్లో జరగనున్న డబ్ల్యూఎంసీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాయి.

చైనాకు చెందిన 'వివో' ఇలాంటి ప్రకటనే చేసింది. కరోనా వైరస్​ తీవ్రతను క్షుణ్ణంగా పరిశిలిస్తున్నాం. ఈ కారణంగా డబ్ల్యూఎంసీలో తొలిసారి అడుగుపెట్టాలన్న నిర్ణయాన్ని వెనక్కితీసుకుంటున్నామని ప్రకటించింది.

ఇదీ చూడండి:పిచాయ్​కు వరుస షాక్​లు... గూగుల్​కు ఏమైంది?

Last Updated : Mar 1, 2020, 12:36 AM IST

ABOUT THE AUTHOR

...view details