Public sector banks loss: తీసుకున్న అప్పును ఎగవేసి, దివాలా తీసిన 13 కంపెనీల వల్ల దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకులకు రూ.2.85 లక్షల కోట్ల మేరకు నష్టం జరిగింది. ఇచ్చిన అప్పులో 23 శాతం నుంచి 95 శాతం వరకు దివాలా పరిష్కార ప్రక్రియలో భాగంగా బ్యాంకులు వదులుకోవాల్సి వచ్చింది. దీనికి తోడు 2021 మార్చి నాటికి బ్యాంకులకు రూ.6.16 లక్షల కోట్ల మేర స్థూల నిరర్ధక ఆస్తుల (జీఎన్‌పీఏ) భారం ఉంది. రద్దుచేసిన పారు బకాయిల మొత్తం కూడా అధికంగానే ఉంది. గీతాంజలి, రీ అగ్రో, విన్‌సమ్ డైమండ్స్, రోటోమ్యాక్, కుడోస్ కెమికల్, రుచి సోయా.. తదితర ఎన్నో కంపెనీలకు ఇచ్చిన అప్పులు రానిబాకీలుగా మారిపోయాయి. ఇటువంటి 50 కంపెనీలకు ఇచ్చిన రుణాల్లో రూ.60,607 కోట్ల మొత్తాన్ని రానిబాకీల కింద బ్యాంకులు ఇటీవల కాలంలో రద్దు చేయాల్సి వచ్చింది. దీనివల్ల బ్యాంకులు ఆర్జించిన లాభాల్లో 70- 75 శాతం సొమ్మును ప్రొవిజన్లకు, రానిబాకీల రద్దుకు కేటాయించాల్సి వచ్చింది.
ప్రైవేటు బ్యాంకులనూ ఆదుకున్నాయ్: గ్లోబల్ ట్రస్ట్ బ్యాంకు నుంచి యస్ బ్యాంకు వరకు.. కష్టాల్లో చిక్కుకున్న ప్రైవేటు బ్యాంకులను ప్రభుత్వరంగ బ్యాంకులే ఆదుకున్నాయి. అతి పెద్ద ఎన్‌బీఎఫ్‌సీ అయిన ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ను ఎస్‌బీఐ, ఎల్‌ఐసీ ఆఫ్ ఇండియా కాపాడిన విషయం విదితమే.