లాక్‌డౌన్ సహా పరిశ్రమలు, ఉద్యోగుల ఆదాయాలు తగ్గిన నేపథ్యంలో 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ.. 9.6 శాతం క్షీణించే అవకాశం ఉందని ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. ఈ పరిస్ధితి గతంలో ఎన్నడూ చూడని దారుణమైన ఆర్థిక స్థితికి అద్దం పడుతోందని అభిప్రాయపడింది.
దక్షిణాసియా ఆర్థిక పరిస్ధితిపై నివేదిక విడుదల చేసిన ప్రపంచ బ్యాంకు.. భారత్‌లో అసాధారణ పరిస్ధితి నెలకొందని తెలిపింది.
ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 25 శాతం వృద్ధి క్షీణించిందని ప్రపంచ బ్యాంకు దక్షిణాసియా వ్యవహారాల ముఖ్య ఆర్థికవేత్త హన్స్ టిమ్మర్ పేర్కొన్నారు. తాము నిర్వహించిన ర్యాపిడ్ సర్వేలో అనేక మంది ఉద్యోగాలు కోల్పోయినట్లు, బ్యాంకుల మొండిబకాయిలు పెరిగిపోయినట్లు గుర్తించామని వివరించారు.
భారత్ చర్యలపై ప్రశంసలు..
కరోనాకు ముందే భారత్‌లో ఆర్థిక పరిస్ధితి క్షీణించిందని తెలిపిన టిమ్మర్... పరిమిత వనరులు, నగదుతో భారత ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం అద్భుతం అని ప్రశంసించారు. భారత్‌లో లాక్‌డౌన్ సమగ్రంగా, పటిష్ఠంగా అమలుచేశారని స్పష్టం చేశారు. ప్రైవేటు రంగంలో కంపెనీలు మనుగడలో కొనసాగేందుకు రుణాల పంపిణీ పెంచడం సహా ఆరోగ్య రంగ అభివృద్ధి, ప్రజల సామాజిక రక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని హన్స్ టిమ్మర్ వెల్లడించారు.