వేసవి కాలం వచ్చేసింది. ఎండలు రోజురోజుకూ ముదిరిపోతున్నాయి. ప్రజలు ఇప్పటికే ఏసీల కొనుగోళ్లను ప్రారంభించారు. అయితే ఎలాంటి ఏసీ తీసుకోవాలి? ఎంత సామర్థ్యం ఉన్న ఏసీ సరిపోతుంది? ఇతర విషయాలేమైనా పరిగణనలోకి తీసుకోవాలా? అన్న దానిపై చాలా అనుమానాలు ఉన్నాయి. ముందుగా వాటి గురించి స్పష్టత తెచ్చుకోవాలి.
కరెంటు బిల్లు ముఖ్యం..
ఏసీని ఉపయోగించినట్లయితే నెలవారీ కరెంటు బిల్లు భారీగా పెరుగుతుంది. అందుకే తక్కువ విద్యుత్‌తో నడిచే ఏసీని ఎంచుకోవటం ఉత్తమం. ఏసీ ఉపయోగించే విద్యుత్ కోసం స్టార్ రేటింగ్ ఉపయోగపడుతుంది. మార్కెట్లో 1 స్టార్ నుంచి 5 స్టార్ రేటింగ్‌లో ఏసీలు అందుబాటులో ఉన్నాయి. రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ విద్యుత్ వినియోగించుకుంటుంది.
మార్కెట్లో ఇన్వర్టర్ ఏసీలు అందుబాటులో ఉన్నాయి. వీటికి స్టార్ రేటింగ్ ప్రత్యేకంగా ఉంటుంది. ఇవి సాధారణ రేటింగ్ ఉన్న ఏసీల కంటే తక్కువ విద్యుత్ బిల్లునిస్తాయి. సాధారణ 5 స్టార్ రేటింగ్ తో ఉన్న ఏసీ కంటే 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ తక్కువ బిల్లునిస్తుంది.
ఎంత సామర్థ్యం ఉన్న ఏసీ కావాలి?
గదికి తగ్గ ఏసీని ఎంచుకోవటం వల్ల కూడా కరెంటు బిల్లును తగ్గించుకోవచ్చు. పెద్ద గదిలో చిన్న ఏసీ ఉంచినట్లయితే చల్లదనం సరిపోదు. చిన్న గదిలో పెద్ద ఏసీని ఉంచటం వల్ల చలి ఎక్కువగా పెట్టటమే కాకుండా... జేబుకు చిల్లు పడుతుంది.